Budget Expectations: సొంత ఇల్లు అనేది భారతీయుల కల. దానిని నెరవేర్చుకునేందుకు పేద, మధ్య తరగతి కుటుంబాలు అష్టకష్టాలు పడుతుంటాయి. బ్యాంకు రుణాలు తీసుకుని చిన్నదో, పెద్దదో ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆర్బీఐ కొన్ని రోజులుగా వడ్డీరేటు పెంచుతూ వస్తోంది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న ఈ రుణాలు ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది. అంతేకాదు అప్పుగా తీసుకున్న అసలు, వడ్డీపై కూడా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్రం హోమ్ లోన్ తీసుకునేవారికి తీపికబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్..
కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ పెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌లో హోమ్ లోన్స్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. హోమ్ లోన్ తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి భారీ ఉపశమనం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పన్ను మినహాయింపు..
ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకునే సామాన్య ప్రజలకు ఊరట కలిగిలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలని, హోమ్ లోన్ అసలు, వడ్డీ పేమెంట్లపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఈ విషయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసపియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో హోమ్ లోన్‌పై ప్రోత్సాహకాల ప్రతిపాదనలు అమలు చేయాలని కోరింది.
రూ.5 లక్షల వరకు మినహాయింపు..
ప్రస్తుతం ఇంటి రుణాలకు చెల్లిస్తున్న అసలుకు సెక్షన్ 80 సీ ప్రకారం పరిమితి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనిపై పడే వడ్డీకి సెక్షన్ 24(బి) ప్రకారం రూ.2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అయితే వడ్డీపై పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని క్రెడాయ్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థిరాస్తి రంగం జీడీపీ, ఉద్యోగాలు, మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. క్రెడాయ్ ప్రతిపాదనలపై ఈసారి బడ్జెట్‌లో గుడ్ న్యూస్ వినడం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.