KCR : యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులైంది. రైతుబంధు ఎప్పుడు వస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలలుగా ఆసరా పింఛన్లే చెల్లించలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఈనేపథ్యంలో రైతుబంధు చెల్లింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికి ఎట్టకేలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రైతులకు శుభవార్త చెప్పారు. జగిత్యాల సభ వేదికగా మరో 10, 15 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం డబ్బులను జమచేస్తామని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు, రైతు బీమా పథకాలు ఆగవని స్పష్టం చేశారు.

ఇక మరోసారి కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలను కేసీఆర్ తూర్పారపట్టారు. కేంద్రం వల్లే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని.. దేశం అల్లకల్లోలం అవుతోందని దుయ్యబట్టారు. ఇక చివర్లో ఎప్పుడూ జై తెలంగాణ అని నినదించే కేసీఆర్ ‘జైభరత్’ అంటూ కొత్త నినాదం అందుకున్నారు. బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త నినాదం వైరల్ అవుతోంది.
డిసెంబర్ 10న తేదీల నిర్ణయం..
రైతుబంధు చెల్లింపు తేదీలపై ఈనెల 10న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదట తక్కువ భూమి ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులను ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న వారికి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు.
ఐదేళ్లుగా పెట్టుబడి సాయం..
2018 వానకాలం సీజన్ నుంచి కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండు సీజన్ల చొప్పున.. ఇప్పటివరకు 9 సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడిసాయం అందించారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు నెలలో ఎకరాకు రూ.5 వేల చొప్పున డబ్బులు అందుతాయి.
వానాకాలంలో 68.94 లక్షల మందికి..
వానకాలం సీజన్‌లో తెలంగాణలో మొత్తం 68.94 లక్షలు మందికి రైతుబంధు అందింది. 1.53 కోట్ల ఎకరాల భూమికి రూ.7,654.43 కోట్లు డబ్బును ఇచ్చారు. రైతుబంధు పథకం కింద రాష్ట్ర రైతులకు ఇప్పటి వరకు రూ.58,102 కోట్ల సాయం అందించారు. ప్రస్తుతం యాసంగి సీజన్ కానున్న నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి పదో విడత రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి.
కొత్తవారికీ పెట్టుబడి..
జూన్ నుంచి ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా భూమిని కొన్నా… వారసత్వ భూమిని తన పేరు మీద నమోదు చేయించుకున్నా.. వారికి కూడా రైతుబంధు డబ్బులు చెల్లిస్తారు. ఆ వివరాలను అప్‌డేట్ చేసి.. మొత్తం అర్హులను గుర్తిస్తారు. వానకాలంలో రూ.7,654 కోట్లు ఇవ్వగా.. ఈసారి ఆ మొత్తం మరింత పెరిగే అవకాశముంది.