Aam Admi MCD : ఢిల్లీ.. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ కి సలాం చేసింది. ఇప్పటికే రెండుసార్లు అధికారం కట్ట బెట్టిన ఆ రాష్ట్రం.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫలితాన్ని అందించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 స్థానాలు గెలుచుకుంది.. బిజెపి 104 స్థానాలకు పరిమితమైంది. ఢిల్లీ బిజెపి చీఫ్ ఆదేశ్ గుప్త నియోజకవర్గం పటేల్ నగర్ లోని నాలుగు వార్డుల్లో నూ కమలం పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం గమనార్హం. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతర అభ్యర్థులు విజయం సాధించారు.

ఎందుకు కట్టబెట్టినట్టు
ఆప్ పుట్టుక ఢిల్లీలోనే మొదలైంది కాబట్టి.. ఆ ప్రాంత ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకొన్నారు. హేమాహేమీలు ఉండే రాజధానిలో వారిని కాదని చీపురు ను అక్కున చేర్చుకున్నారు. అందువల్లే ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస విజయాలు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రభావం పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రం మీద పడింది. ఆ రాష్ట్రంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆప్ పీఠాన్ని అధిష్టించింది. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. అక్కడ విజయావకాశాలు ఎలా ఉన్నా.. భవిష్యత్ దృష్ట్యా పార్టీ సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తోంది.
సామాన్యులకు నచ్చింది
ఢిల్లీ అనేది ఒక మినీ ఇండియా.. రకరకాల నేపథ్యాలు ఉన్న ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు పాలించిన పార్టీలు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు.. అయితే మొదటిసారి అక్కడ అధికారంలోకి వచ్చిన ఆప్.. పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేసింది. బస్తి దావాఖానాలు నిర్మించింది. యువత కోసం గ్రంథాలయాలు నిర్మించింది. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రేషన్ పంపిణీ, స్థానిక సంస్థల్లో జవాబుదారితనం వంటి వాటిని పెంపొందించింది. ఈ మోడల్ పాలన ఢిల్లీ ప్రజలకు నచ్చడంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చీపురు గుర్తుకు జై కొట్టారు. నగర ప్రజలకు ఏం కావాలో, ఏం కోరుకుంటారో అది ఆప్ వారికి ఇచ్చింది.
అవి పని చేయలేదు
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ముందు మద్యం కుంభకోణం, పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో అవినీతి వంటివి తెరపైకి వచ్చాయి. ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముడుపులు తీసుకున్నారనే విమర్శలూ గుప్పు మన్నాయి. అయితే ఇవేవీ ఓటర్ల మనసు మార్చలేకపోయాయి. పైగా 15 సంవత్సరాలుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను బిజెపి పాలిస్తోంది. ఆ పార్టీ నేతల పాలన పై ప్రజలకు విసుగు రావడం కూడా ఆప్ విజయానికి ఒక కారణమని ఎన్నికల విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఒకరోజు ముందుగానే ఆప్ కమలం పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. కాగా 2017 మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి 181, ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఆప్ గెలిచినా గత బీజేపీ రికార్డు బ్రేక్ చేయలేక పోయింది.