వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులకు 2వ సంవత్సరం ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగంగా వాహనా యజమానులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4న ప్రారంభించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
విజయవాడ ఆర్టీసీ రాష్ట్ర కార్యాలయం పరిపాలనా భవనంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ టి కృష్ణబాబు, కమిషనర్ పి ఎస్ ఆర్ ఆంజనేయలు పాల్గొన్నారు. అయితే ఈ పథకం కోసం గతేడాది రెండు విడతలుగా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2,36,340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించారు. ఇందుకోసం రూ.230 కోట్లలను ప్రభుత్వం విడుదల చేసింది.