AP MLC elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయంతో టిడిపి ఊపిరి పీల్చుకున్నట్లయింది. అత్యంత పకడ్బందీగా ఎన్నికలకు సిద్ధమైన టిడిపి అధికార పార్టీ అసమ్మతులను మచ్చిక చేసుకుని ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక్క స్థానమే అయినప్పటికీ.. ఇది ఆ పార్టీకి మంచి బూస్టప్ గా భావించాల్సి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2014 ఎన్నికల నుంచి ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రతిచోట ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని తీవ్ర ఇబ్బందులను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. ఒకానొక దశలో 2024 వరకు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఉంటారా..? అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లోను ఓటమితో కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతింది. దీంతో ఇప్పట్లో పార్టీ గెలిచి బట్ట కట్టే పరిస్థితి లేదన్న భావన ఆ పార్టీ ముఖ్య నాయకుల్లోనే వ్యక్తమైంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు క్యాడర్ ను మళ్లీ సమాయత్తం చేయడంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగానే కృషి చేశారు. కొన్ని నెలలపాటు పార్టీని గాడిలో పెట్టేందుకు ఎంతగానో శ్రమించారు. ఒక పక్క సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పాటు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇది చాలావరకు మంచి ఫలితాలను ఇచ్చింది.
-కలిసి వచ్చిన అభ్యర్థుల ఎంపిక..
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గొప్ప బూస్టప్ గా భావించాలి. ఉత్తరాంధ్రతోపాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి గొప్ప విజయంగానే చెప్పాలి. నాలుగేళ్లుగా ఓటమి తప్ప మరో మాట తెలియని తెలుగుదేశం పార్టీ నాయకులకు, శ్రేణులకు మూడు చోట్ల విజయం మానసికంగా గొప్ప స్థైర్యాన్ని కలిగించింది. అయితే, ఈ విజయాలను సాధించడం వెనక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళిక దాగి ఉందన్నది సుస్పష్టం. అభ్యర్థుల ఎంపిక నుంచి, వారి ప్రచారం వరకు అంతా క్షుణ్ణంగా ఆయన పరిశీలన జరిపారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే మార్గాలను చూపించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిందని చెప్పాలి. పార్టీ బలంతో పాటు ఇద్దరు అభ్యర్థులకు ఉన్న సొంత ఇమేజ్ ఈ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడానికి దోహదం చేశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ముందుగా నిర్ణయించిన అభ్యర్థిని మార్చి.. ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసిన చిరంజీవి రావును బరిలోదించడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసిన చిరంజీవి రావు స్టూడెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా చిరంజీవి రావు మాస్టారు విజయానికి సైలెంట్గా కృషి చేశారు.
-వ్యూహంతోనే విజయం..
ఇక తాజా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం వెనుక తెలుగుదేశం పార్టీ వ్యూహం దాగి ఉంది. అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుని, వారికి భరోసా కల్పించడం ద్వారా ఇక్కడ నాలుగు ఓట్లను సాధించగలిగింది తెలుగుదేశం పార్టీ. తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన నలుగురి వల్ల నష్టపోయిన నాలుగు ఓట్లను.. అధికార పార్టీ నుంచి వచ్చేలా చేయడం మామూలు విషయం కాదు. రాజకీయ వ్యూహంతోనే ఇది సాధ్యమైంది.
-ఉత్సాహంగా సార్వత్రిక ఎన్నికలకు..
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగా వచ్చిన ఈ నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు తెలుగుదేశం పార్టీకి మంచి ఊపును ఇచ్చేవిగానే చెప్పాలి. ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు మూడు స్టార్ట్ అయింది. ఈ ఫలితాలు వైసిపి ప్రభుత్వంపై కాస్తో, కూస్తో వ్యతిరేకంగా ఉన్న వర్గాలకు టిడిపి దగ్గర ఎందుకు అవకాశం కల్పిస్తుంది. వరుస విజయాలతో వచ్చిన ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధమవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీని గట్టిగా ఊపిరి పీల్చుకునేలా చేసాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు.