G-20 menu : సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీ వేదికగా జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశాలకు సర్వం సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు భారత్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో జీ_20 సమ్మిట్ నిర్వహించనున్నారు. జీ_20 అతిధులకు అరుదైన గౌరవం దక్కనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిధుల కోసం బంగారు, వెండి ప్లేట్లలో వంటకాలు వడ్డించనున్నారు. జైపూర్ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఐఎస్ సిల్వర్ వేర్, గోల్డ్ వేర్ పాత్రల్లో వంటకాలు అతిధులకు వడ్డిస్తారు. శాకాహార, మాంసాహార వంటకాలను మెనూ లో చేర్చారు. అతిధులకు ఎలాంటి వంటకాలు ఇష్టమో ముందే తెలుసుకొని వాటిని చేయించే పనిలో నిర్వాహకులు పడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రఖ్యాతమైన హోటలలో పనిచేసే పాక శాస్త్ర నిపుణులను ఢిల్లీకి రప్పించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 30 నుంచి 40 వంటకాలు మెనూలో ఉన్నాయని తెలుస్తోంది.. ఇప్పటికే లీలా ప్యాలస్ హోటల్ లో దీనికి సంబంధించిన సన్నాహాలు కొనసాగుతున్నాయి. అయితే మెనూలో దేశంలో ప్రముఖంగా లభించే వంటకాలను చేర్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యాని, తెలంగాణ నాటుకోడి కూర, ఆంధ్ర పీతల పులుసు వంటి వాటిని కూడా చేర్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతానికి చెందిన ప్రతినిధులకు మాంసాహార వంటకాలను రుచి చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేకమైన మెనూ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ట్రాఫిక్ ఆంక్షలు
మూడు రోజులు జరిగే జీ20 సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఐటీ సెక్టార్ మినహా మిగతా సంస్థలు మొత్తం ఆ మూడు రోజులు ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీ 20 సమ్మిట్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయో ముందుగానే అధికారులు ప్రకటించారు. ఆ మూడు రోజులపాటు బయటికి రాకపోవడమే ఉత్తమమని ఢిల్లీ పౌరులకు సూచించారు. ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, లీలా హోటల్, తాజ్ గ్రూప్ హోటల్స్..పరిసర ప్రాంతాలలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఐటీ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని చెబుతున్నారు.
సమ్మిట్ జరిగే భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్ పరిసర ప్రాంతాలను కేంద్ర భద్రత దళాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, అధునాతనమైన డ్రోన్లను ఏర్పాటు చేశాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భారత సంస్కృతి ప్రతిబింబించే విధంగా.. ప్రధాన కూడళ్లలో నటరాజ విగ్రహాలు ఏర్పాటు చేశారు. భారతీయ నృత్య రీతులు, పనిముట్లు, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను ఏర్పాటు చేశారు. జి 20 సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీ సర్వాంగ సుందరంగా కనిపిస్తోంది.
#WATCH | Delhi: Delegates of the G20 Summit to be served in silverware and gold utensils pic.twitter.com/1f2Zm0wGTL
— ANI (@ANI) September 6, 2023