Sanwariya Seth Temple: మనది సాంప్రదాయ దేశం. దేవుళ్లను విపరీతంగా కొలిచే దేశం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశం. అందువల్లే మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆలయాలు ఉంటాయి. దాదాపు అందరి దేవుళ్లకు మనదేశంలో స్థానం ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఆ దేవుళ్లకు పూజలు జరుగుతుంటాయి. వేడుకలు విభిన్నంగా జరుగుతుంటాయి. ఆలయాలను సందర్శించే భక్తులు తమ కోరికలను తీర్చితే దేవుళ్లకు కానుకలు ఇస్తుంటారు. తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా కానుకలను సమర్పించి.. దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటారు.
దేవుళ్లకు భక్తులు ఖరీదైన కానుకలు సమర్పించడం మనదేశంలో ఎప్పటినుంచో ఉంది. కొందరు బంగారు కిరీటాలను ఇస్తారు. ఇంకొందరు వెండి వస్తువులను సమర్పిస్తారు. మరికొందరు డాలర్లను, ఇతర ఖరీదైన వస్తువులను దేవుళ్లకు కానుకలుగా ఇస్తుంటారు. ఎవరికి తగ్గట్టుగా వారు తమ భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే రాజస్థాన్లోని చిత్తోర్ ఘడ్ జిల్లా సావరియా సేట్ ఆలయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ భగవానుడికి ఓ భక్తుడు అత్యంత విచిత్రమైన కానుకను సమర్పించాడు.
ఆ అజ్ఞాత భక్తుడు స్వామి వారికి 300 గ్రాముల బరువైన వెండి రివాల్వర్, 190 గ్రాముల బరువు ఉన్న వెండి బుల్లెట్లు కానుకలుగా సమర్పించాడు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో ఈ ఆలయంలో స్వామివారికి వెండి విమానం, వెండి ట్రాక్టర్, వెండి చేతిసంకెళ్ళు, వెండి పెట్రోల్ పంపు మోడల్స్, పది తలల వెండి రావణుడు వంటి కానుకలను ఇచ్చారు. కొంతమంది భక్తులు లాప్టాప్, ఐఫోన్ కానుకలను సమర్పించారు.
ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అత్యంత మహిమాన్వితుడని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. స్వామి వారి వేడుకలు జరిగినప్పుడు తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఆ వేడుకలలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేస్తారు. స్వామివారికి నివేదించిన తర్వాత భక్తులకు పెడుతుంటారు. అయితే ఈ ఆలయంలో స్వామివారికి వెండి రివాల్వర్, బుల్లెట్లు కానుకలుగా సమర్పించడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు అంటున్నారు.