Cyber frauds: ఒక్కోసారి నేరగాళ్లకు మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్లకు మనమే అవకాశం ఇస్తాం. దొంగకు తాళం చెవి ఇచ్చినట్టు.. మనమే దోచుకోండి అని దారి చూపిస్తాం. దారి చూపించిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఎందుకు ఊరుకుంటారు. ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు. చూస్తుండగానే ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు. ఆ తర్వాత ఎంత నెత్తి నోరూ కొట్టుకున్నా ఉపయోగం ఉండదు. ఇటువంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురయింది..
ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని మరిపెడ ప్రాంతంలో వ్యాపారిగా కొనసాగుతున్నాడు.. సరిగ్గా ఇతడి ఫోన్ కు 15 రోజుల క్రితం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అతని గురించి వివరాలు తెలుసుకొని మాట్లాడారు. అయితే ఆ వ్యాపారి తనతో మాట్లాడుతోంది నేరగాళ్లు అని గుర్తుపట్టలేకపోయాడు. ఆ తర్వాత మీలాంటి వ్యాపారుల కోసం ఒక దగ్గర పార్టీ నిర్వహిస్తున్నామని.. అక్కడికి అందమైన అమ్మాయిలు వస్తున్నారని.. వారితో సరదాగా గడపచ్చని చెప్పారు. ముందూ వెనకా ఆలోచించకుండా ఆ వ్యాపారి ఓకే అన్నాడు. ఆ తర్వాత ఒక అందమైన అమ్మాయి ఫోటో పంపించారు. ఆ తర్వాత అదే అమ్మాయిని ఎరగా వేసి తమ ముగ్గులోకి లాగారు. ఆ వ్యాపారి సైబర్ నేరగాళ్లు ఊహించినట్టుగానే వారి ట్రాప్ లో పడ్డాడు. ఆ తర్వాత ఆ నేరగాళ్లు తమ అసలు ప్రణాళిక మొదలుపెట్టారు.
అసలే సైబర్ నేరగాళ్లు కావడంతో ఆ వ్యాపారి బలహీనమైన క్షణాన్ని ఆసరాగా చేసుకొని.. అతడి ఫోన్, సిమ్, ఆధార్ కార్డులను మొత్తం బ్లాక్ చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న 3.59 లక్షలు స్వాహా చేశారు. అయితే ఆ వ్యాపారి ఇలా బ్లాక్ ఎందుకయ్యాయో అర్థంకాక.. ఆ తర్వాత సంబంధిత కార్యాలయాలను సంప్రదించి అన్ బ్లాక్ చేసుకున్నాడు. ఈలోగా తన ఖాతాను పరిశీలించగా అందులో ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత 1930 నెంబర్ కి కాల్ చేసి తన బాధను మొత్తం చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఫిర్యాదు చేశాడు.. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముఠా రాజస్థాన్ కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తాందని.. డార్క్ వెబ్ ద్వారా నెంబర్లు సేకరించి ఇలా మాయమాటలు చెబుతుందని.. దీనికి ఏకంగా కాల్ సెంటర్లో నిర్వహిస్తోందని.. ఆ తర్వాత వీడియోలు చూపించి.. బలహీనమైన క్షణాన్ని ఆసరాగా లక్షలు దండుకుంటున్నదని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ వ్యాపారి కేసులో ఇంకా ఎన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.