Homeఆంధ్రప్రదేశ్‌Gidugu Ramamurthy Jayanthi : గిడుగు రామమూర్తికి ఆంధ్రా ప్రభుత్వం అరుదైన గౌరవం

Gidugu Ramamurthy Jayanthi : గిడుగు రామమూర్తికి ఆంధ్రా ప్రభుత్వం అరుదైన గౌరవం

Gidugu Ramamurthy Jayanthi  : తెలుగు వాడుక  భాషా ఉద్యమ పితామహుడు,  వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు అయిన  గిడుగు వెంకట రామమూర్తికి అరుదైన గౌరవం ఇస్తోంది. ఆయన  జయంతిని పురస్కరించుకుని ఆగస్టు మాసంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఇన్చార్జి అధ్యక్షుడు పి.విజయబాబు తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయం నాలుగో భవనం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ  రాష్ట్రంలో పరిపాలనా భాషగా తెలుగును అమలు పర్చేందుకు తెలుగు అధికార భాషా సంఘం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు ఇన్చార్జి అధ్యక్షునిగా తనను నియమించినందుకు   రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.
   ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు అయిన  గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా  నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాల వారీగా భాషా వారోత్సవాలను నిర్వహించి సాహితీ స్రష్టలను, భాషా సేవకులను పెద్ద ఎత్తున గుర్తించి సముచిత స్థాయిలో సత్కరించడం జరుగుతుందన్నారు. తెలుగు సంపదను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని సత్కరించుకోవడ మంటే మనలని మనం సత్కరించుకోవడమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటు వంటి కార్యక్రమం గతంలో  ఎన్నడూ జరుగలేదన్నారు.  అదే విధంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, సేవా సంస్థల సౌజన్యంతో భాషా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తమిళనాడులోని సేవా సంస్థల సహకారంతో భాషా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు త్వరలో మద్రాసు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో టి.టి.డి. వారి సౌజన్యంతో భాషా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, అన్నమయ్య పద సంపద, వేటూరి ప్రభాకర శాస్త్రి పరిశోధనలు, వెంగమాంబ సాహిత్యం తదితర అంశాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సౌజన్యంతో ఉత్తరాంధ్రా సాహిత్య సభలను కూడా త్వరలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. చాసో, కొడవటిగంటి కుటుంబరావు కథా సాహిత్యం, శ్రీశ్రీ విప్లవ సాహిత్యం, వంగపండు జానపద సాహిత్యం తదితర అంశాలతో ఈ సభా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. తెలుగును పరిపాలనా భాషగా అమలు పర్చేందుకు  తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఎన్.టి.ఆర్. జిల్లా మరియు గుంటూరు జిల్లా కలెక్టర్లు  ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు.
 ఆర్.టి.ఐ. తరహాలో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ స్వయం ప్రతిపత్తిగల సంస్థని, ఈ సంస్థకు విశేషమైన అధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.  అంతర్జాతీయ స్థాయిలోను , రాష్ట్రేతరంగా ఉన్న తెలుగు సంఘాలు,  వారి సమస్యలను పరిష్కరించేందుకు, వారికి సహకరించేందుకు  ఈ ప్రాధికార సంస్థ కృషిచేస్తుందన్నారు. తెలుగు భాష అమలుకు సంబంధించి ప్రాధికార సంస్థ చేసిన సూచనలను, సలహాలను అమలు పర్చని  ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వేతర  వ్యాపార, వాణిజ్య సంస్థలకు కనిష్టంగా రూ.10 వేల నుండి  గరిష్టంగా  రూ.60 వేల వరకూ జరిమానా విధించే అధికారం ఈ సంస్థకు ఉందన్నారు.  అయితే ఇటు వంటి  అధికారాలు  ఉన్నాయి గదా అని  ముందుగానే కొరడా జుళిపించకుండా తెలుగును పరిపాలనా భాషగా అమలు పర్చేందుకు ఎదురవుతున్న సమస్యలను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు, అధికారుల ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  అదే విధంగా రాష్ట్రంలోని వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులు పైభాగంలో పెద్ద అక్షరాలతో తెలుగులోను, క్రింద చిన్న అక్షరాలతో ఆంగ్లంలోనూ ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిఫల్ కమిషనర్లు అందరికీ సూచించడం జరిగిందని ఆయన తెలిపారు. స్పందన కార్యక్రమంలో నూటికి నూరు శాతం తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని జిల్లా కలెక్టర్లకు సూచించడమైందన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో తీర్పులు కూడా తెలుగులోనే వెలువరించాలని   రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం  తాత్కాలిక  ప్రధాన న్యాయ మూర్తిని కలిసి కోరడమైందని ఆయన తెలిపారు.
ఎన్ని రాజకీయ విబేధాలు ఉన్నప్పటికీ  భాష విషయానికి వచ్చే పాటికి తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఒకటవుతాయని, అదే తరహాలో తెలుగు భాషను పరిపుష్టం చేసుకునేందుకు, దాన్ని పరిరక్షించుకునేందుకు  రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular