Skanda Teaser Review: టాలీవుడ్ ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. హీరో ఎవరైనా ఆయన సినిమా అంటే కత్తి పట్టాల్సిందే, రక్తపుటేరులు పారించాల్సిందే. కెరీర్ బిగినింగ్ నుండి తనకంటూ ఓ శైలి క్రియేట్ చేసుకుని చిత్రాలు చేస్తున్నాడు. బోయపాటి కెరీర్లో భద్ర, సింహ, లెజెండ్, సరైనోడు, అఖండ వంటి హిట్స్ ఉన్నాయి. బాలయ్యతో బోయపాటికి బెస్ట్ కాంబినేషన్ గా ఉంది. అఖండ చిత్ర విజయంతో మంచి ఊపుమీదున్న బోయపాటి శ్రీనుతో రామ్ పోతినేని మూవీ చేస్తున్నారు.
అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. రామ్ పోతినేని, బోయపాటి నార్త్ ఇండియాలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రానికి స్కంద అంటే టైటిల్ నిర్ణయించారు. ట్యాగ్ లైన్ గా ది అటాకర్ అనే ఎలివేషన్ ఇచ్చారు. నేడు స్కంద టైటిల్ టీజర్ విడుదల చేశారు. రామ్ పోతినేని భారీ ఊరమాస్ డైలాగ్ కొట్టాడు. ‘మీరు దిగితే ఊడేది ఉండదు నేను దిగితే మిగిలేది ఉండదు’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు.
గుడి అవసరంలో కత్తితో రౌడీలను ఊచకోత కోస్తున్న విజువల్స్ అదిరిపోయాయి. పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ బోయపాటి తన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారని తెలుస్తుంది. ఇక బోయపాటి శ్రీను అచ్చ తెలుగు టైటిల్స్ ఎంచుకుంటున్నారు. జయ జానకీ నాయక, వినయ విధేయ రామ వంటి టైటిల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
స్కంద సైతం భిన్నంగా ఉండటంతో పాటు ఆసక్తి రేపుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. వీరి కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. ఇక రామ్ పోతినేని విజయాలు లేక అల్లాడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ అనంతరం ఆయనకు హిట్ లేదు. మరి బోయపాటి అయినా రామ్ కి క్లీన్ హిట్ ఇస్తాడేమో చూడాలి.