దళితబంధు పేరుపెట్టి కేసీఆర్ దళితుల్ని దగా చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దళితులకు చెప్పింది ఏది జరగలేదని ఆమె విమర్శించారు. దళిత సీఎం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని అన్నారు. రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి ఆ తర్వాత దళితున్ని చేసి బర్తరఫ్ ఎందుకు చేశారో చెప్పలేదు. ఎస్సీ- ఎస్టీ సబ్ ప్లాన్ మారుస్తా అని మార్చలేదని ఆరోపించారు. ఏడేళ్లుగా 85వేల కోట్లు కేటాయించి.. 47వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
38వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడ పోయాయో ఎవ్వరికీ తెలీదన్నారు. దళితులకు బడ్జెట్ లో కేటాయించిన నిధులే పూర్తిగా ఖర్చు చేయని కేసీఆర్ లక్షల కోట్లు పెడుతా అంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. 5లక్షల 33వేల దరఖాస్తులు వస్తే 1లక్ష దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఎస్సీలకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం తెచ్చిన జీవోలు కాగితాలకే పరిమితం అవుతున్నాయన్నారు.
దళితులకు భూపంపిణీ ప్రతిష్టాత్మకం పథకం అన్నారని అది ఏమైందని గీతారెడ్డి ఆరోపించారు. మూడెకరాల లబ్ధి కోసం 3లక్షల కుటుంబాలు ఉంటే.. 6662 కుటుంబాలకు 16వేల ఎకరాలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. దళితులతో వివాహం జరిగితే మృత్యువాత పడుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు.
అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో కనీస స్టాప్ లేకుండా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ కు పూలమాల వేశారా? అని ప్రశ్నించారు. దళితబంధు పథకానికి అమలుకు మాకు అభ్యంతరం లేదని.. కానీ రాష్ట్రం అంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఎన్నికల కోసమే హుజురాబాద్ లో దళితబంధు ఫైలెట్ ప్రాజెక్టు అమలు అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని విమర్శించారు. 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహం చైనాలో తయారు అవుతుందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ లో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయపోతే రాష్ట్రం అంతటా అమలు చేయమని దళితుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారని గీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.