ప్ర‌భుత్వానిది ‘చెత్త’ విధానంః జ‌న‌సేన‌

అసలే కరోనా కాలం.. చేయడానికి పనిలేదు. కడుపునిండా తినడానికి తిండి లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల్సింది ప్ర‌భుత్వాలే. కానీ.. ఈ ప‌ని చేయ‌కుండా.. జ‌నం నుంచే డ‌బ్బులు వ‌సూలు చేసే విధానాలు చేప‌డితే.. ఏమ‌నాలి? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ఇదే ర‌కమైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యం చ‌దివిన త‌ర్వాత ఆ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలో మీరే నిర్ణ‌యించండి. ఏపీలో చెత్త‌మీద ప‌న్ను వేస్తూ ఆదేశాలు జారీచేసింది ప్ర‌భుత్వం! దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. […]

Written By: Bhaskar, Updated On : June 6, 2021 7:55 pm
Follow us on

అసలే కరోనా కాలం.. చేయడానికి పనిలేదు. కడుపునిండా తినడానికి తిండి లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల్సింది ప్ర‌భుత్వాలే. కానీ.. ఈ ప‌ని చేయ‌కుండా.. జ‌నం నుంచే డ‌బ్బులు వ‌సూలు చేసే విధానాలు చేప‌డితే.. ఏమ‌నాలి? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ఇదే ర‌కమైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యం చ‌దివిన త‌ర్వాత ఆ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలో మీరే నిర్ణ‌యించండి.

ఏపీలో చెత్త‌మీద ప‌న్ను వేస్తూ ఆదేశాలు జారీచేసింది ప్ర‌భుత్వం! దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విష‌య‌మై జ‌న‌సేన స్పందించింది. ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ మేర‌కు ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఆ లేఖ‌లో ఆయ‌న ఏమ‌న్నారంటే…

‘‘రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు క‌రోనాతో ఆర్థికంగా క‌ష్టాలు ప‌డుతున్నారు. వారిలో ధైర్యాన్ని నింపి బ‌తుకు బండి గాడిన ప‌డేలా చేయాల్సిన ప్ర‌భుత్వం.. ఆ బాధ్య‌త‌ను విస్మ‌రించింది. పైగా.. కొత్త ప‌న్నులు ఎలా వ‌సూలు చేయాలి? అనే విష‌యంపై దృష్టి పెట్టింది. మునిసిపాలిటీల్లో చెత్త ప‌న్ను పేరుతో ప్ర‌జ‌ల‌ను పీడించే కార్య‌క్ర‌మానికి వైసీపీ సిద్ధ‌ప‌డటాన్ని జ‌న‌సేన తీవ్రంగా ఖండిస్తోంది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల ద్వారా జీవ‌నం పొందే వారి నుంచి కూడా ముక్కుపిండి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌బోతున్నారు. ఇదేం ప‌ద్ధ‌తి?’’ అని ప్రశ్నించారు నాదెండ్ల.

అంతేకాకుండా.. ‘‘ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెబుతున్న ప్రభుత్వం.. ఒక చేత్తో ఇచ్చి, మ‌రో చేత్తో తీసుకుంటోంది. మునిసిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ నుంచి ప్ర‌భుత్వం త‌ప్పుకునేందుకే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ రెండేళ్ల‌లో ఏ న‌గ‌రంలోనైనా ఒక్క‌డ డంపింగ్ యార్డులోనైనా ఆధునిక విధానంలో చెత్త తొల‌గించారా? ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన విధానాల‌తో చెత్త నుంచి సంప‌ద సృష్టించే ప‌నులు చేప‌ట్టారా? ఇవ‌న్నీ వ‌దిలి ప్ర‌జ‌ల‌పై ప‌న్నులు వేస్తామ‌ని చెప్ప‌డం స‌మంజ‌స‌మేనా? ఇలాంటి చెత్త ప‌న్ను విధానాల‌ను ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవాలి’’ అని నాదెండ్ల ఘాటుగా విమర్శించారు.

నిజానికి కరోనా సమయంలో ఇలాంటి నిర్ణ‌యం ఏ మాత్రం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జ‌లు ఎన్నో క‌ష్టాల్లో ఉండ‌గా.. ఇలాంటి ప‌న్నులు వేయ‌డ‌మేంట‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.