Ganta Srinivasa Rao: పార్టీ కోసం పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తాం.. షో మ్యాన్ లను పక్కన పెడతాం.. ఇటీవల చంద్రబాబు టీడీపీ నేతలకు పంపుతున్న హెచ్చరికలివి. దీంతో మన విశాఖ నేత గంటా శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. పార్టీలో యాక్టివ్ అవ్వడం ప్రారంభించారు. ఎన్నికల వరకూ వేచిచూస్తే అసలుకే మోసం వస్తుందని భావించి..చివరకు టీడీపీయే బెటర్ అని ఫిక్సయ్యారు. గోడ మీద పిల్లివాటంగా ఉంటే ఏ పార్టీ టిక్కెట్ లభించదన్న భావనకు వచ్చిన గంటా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓ దశలో పార్టీ అంటే అంటీముట్టనట్టుగా ఉండేవారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినా కనీసం పలకరించే వారు కాదు. చంద్రబాబు వ్యక్తిగత జీవితంపై విపక్ష నేతలు ఆరోపణలు చేసినప్పుడు సైతం ముఖం చాటేశారు. అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి పార్టీ కార్యక్రమాల్లో హల్ చల్ చేస్తుండడంపై తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గంటాలో ఇదేం మార్పు అని చర్చించుకుంటున్నారు.
టిక్కెట్ బెంగతోనే..
కేవలం టికెట్ భయంతోనే గంటా టీడీపీలోకి రీ బ్యాక్ అయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన విశాఖ నగరంలో మాత్రం గౌరవం దక్కించుకుంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో గెలుపొందింది. సహజంగా అధికార పార్టీ వైపు మొగ్గుచూపే గంటా వైసీపీలోకి జంప్ చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో వైసీపీకి సంఖ్యాబలం అధికంగా ఉండడం, స్థానిక వైసీపీ నేతలు వ్యతిరేకించడంతో గంటా సైలెంట్ అయిపోయారు. తరువాత బీజేపీలో చేరనున్నారని టాక్ వినిపించింది. ఎందుకో ఆ పార్టీ వైపు వెళ్లలేదు. వైసీపీలోకి రావాలంటే గంటా పదవులకు రాజీనామా చేయాలన్న జగన్ షరతు పెట్టడం కూడా గంటా వైసీపీలోకి వెళ్లకుండా ఉండడానికి ఒక కారణంగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో వెళ్లేందుకు లేని షరతులు గంటా విషయానికి వచ్చేసరికి తెరపైకి రావడంతో గంటా మనస్తాపం చెందారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని టీడీపీకి సైతం కొద్దిరోజులు దూరమయ్యారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు తదితర కారణాలతో గంటా ఇప్పుడు బయటకు వస్తున్నారు. వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే గంటా విషయంలో టీడీపీలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కాస్తో..కూస్తో పెద్ద నాయకుడు యాక్టివేట్ కావడంతో శ్రేణులు సంబరపడుతుండగా.. కొందరు మాత్రం అధికార కాంక్షతో ఉండే ఇటువంటి నాయకులు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: TDP Rebel MLAs: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు పొమ్మనలేక పోగా.. పూర్వాశ్రమం వైపు వారి చూపు
జనసేన వైపు చూసినా..
ఒకానొక దశలో ఆయన జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలినాళ్లలో వైసీపీ కాదంటే జనసేనలోకి వెళ్లాలనేది గంటా ప్లాన్. అందుకే కాపు సభలకి కూడా ఆయన ఉత్సాహంగా హాజరయ్యారు. కాపు అనే బ్రాండ్ తో పవన్ పంచన చేరి పార్టీలో కీలకంగా ఎదగాలనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ గంటాకి ఝలక్ ఇచ్చారు. టీడీపీతో కలిసేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల బాబు, పవన్ స్నేహంపై పూర్తిగా క్లారిటీ రావడంతో టీడీపీలో ఉన్నా జనసేనకి వెళ్లినా ఒకటేననే విషయం గంటాకు అర్థమైంది. పార్టీ మారినా పొత్తుల్లో భాగంగా టికెట్ సంపాదించి పోటీ చేయాలి. అదేదో టీడీపీలోనే ఉంటే, జనసేన సపోర్ట్ కూడా తనకే ఉంటుంది కదా అనేది గంటా విశ్లేషణగా కనిపిస్తోంది. అందుకే మెల్లగా పార్టీ కార్యకలాపాలల్లోకి అడుగుపెడుతున్నారు. 2024 కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గంటాలో సడన్ మార్పుకి ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Hero Daughter Glamor Treat: హీరోగారి కూతురు గ్లామర్ ట్రీట్: అందాల ఆరబోతతో షేక్ చేసి పడేసింది !