Ganta Srinivasa Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అస్త్రాన్ని సంధించి సంచలనం రేపారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఏడాది క్రితం ఇచ్చిన రాజీనామా ప్రస్తుతం మరుగున పడింది. తాజాగా దానికి మళ్లీ తెరపైకి తెచ్చారు ఎమ్మెల్యే. ఈమేరకు తన రాజీనామా ఆమోదించాలని మరోమారు స్పీకర్‌ను కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే తమ్మినేని సీతారాంకు రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు కూడా. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ అంశం మరుగున పడిపోయింది. మధ్యలో ఓసారి రాజీనామా ఆమోదంపై కోర్టుకెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ ఎందుకో వెళ్లలేదు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన తర్వాత స్పీకర్‌కు ఆమోదించకపోవడానికి కారణాలు లేవు. కానీ ఆయన ఆమోదించలేదు. గంటా కూడా ఎప్పుడూ పెద్దగా పట్టుబట్టలేదు ఎప్పుడో ఓ సారి తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆమోదించుకోవాలంటే ధర్నాలు చేయడం లాంటివి చేసి ఉండేవారు. కానీ అలాంటివేమీ చేయలేదు.

ప్రధాని రాక నేపథ్యంలో మళ్లీ తెరపైకి..
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా రాజీనామా అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభుత్వం అనుకుంటే..
ఏపీలోనూ ఓ ఉపఎన్నిక తీసుకురావాలని వైసీపీ సర్కార్ అనుకుంటే తక్షణం ఆ రాజీనామాను ఆమోదించవచ్చు. మరోఆరు నెలల్లో ఉపఎన్నిక వస్తుంది. ప్రజా వ్యతిరేకత తమ వైపు లేదని నిరూపించుకోవడానికి వైసీపీకి అవకాశం ఉంటుంది. గతంలో బద్వేలు, ఆత్మకూరులాంటి చోట్ల ఉపఎన్నికలు జరిగినా .. అవి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల వచ్చాయి. ప్రతిపక్షం పోటీ పెట్టలేదు. అందుకే ఈసారి విశాఖలో అదీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబట్టి వైసీపీకి చాన్స్ ఉంటుంది.

కానీ ఎందుకు రాజీనామాను ఆమోదించడం లేదన్న సందేహాలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అంత ఎక్కువగా లేదని జీవీఎంసీ ఎన్నికల్లోనే తేలిపోయింది. అయినా.. గంటా రాజీనామా ఆమోదించడంలో తాత్సారంపై స్పీకర్ సరైన కారణం చూపకపోగా, ఆమోదం కూడా తెలపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.