Kalyan Ram: కళ్యాణ్ రామ్.. ప్రతిభ ఉన్న నటుడే. కానీ ఎందుకో అదృష్టం అతడి తలుపు తట్టడం లేదు. అప్పుడెప్పుడో పటాస్ విజయం తర్వాత ఏడేళ్లు ఎదురు చూస్తే గాని బింబిసార రూపంలో మరో హిట్ అతడికి లభించలేదు. ఈ చిత్రం ఇచ్చిన ఊపు కావచ్చు. కళ్యాణ్ రామ్ మరింత సెట్టిల్డ్ గా సినిమాలు చేస్తున్నాడు. బింబిసారకు సీక్వెల్ కూడా ఉంటుందని ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఆమధ్య కళ్యాణ్ రామ్ హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో అమిగోస్ అనే సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. సోమవారం ఉదయం ఈ చిత్రానికి సంబంధించి ప్రచార పోస్టర్ విడుదలైంది. అందులో మూడు రూపాల్లో కళ్యాణ్ రామ్ కనిపించాడు. ప్రచార పోస్టర్ కింద ” మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు మీరు చనిపోతారని వారు అంటున్నారు” అని రాసుకొచ్చారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కు జోడిగా కన్నడ నటి అశిక రంగనాథ్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీత దర్శకుడు. రాజేంద్రనాథ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ రూట్లో..
ఐదేళ్ల క్రితం ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో జై లవకుశ అనే సినిమా వచ్చింది. దీనిని కళ్యాణ్ రామ్ నిర్మించాడు. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాశి ఖన్నా, నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. వైకల్యంతో బాధపడే ఓ వ్యక్తి తీర్చుకునే రివెంజ్ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దారిలోనే కళ్యాణ్ రామ్ వెళ్తున్నాడు. మైత్రి మూవీస్ ప్రకటించిన అమిగోస్ చిత్రంలో మూడు పాత్రల్లో నటించబోతున్నాడు. అన్నట్టు అమిగోస్ అంటే ఇంగ్లీషులో మిత్రుడు అని అర్థం వస్తుంది. ” ఊహించిన వాటిని ఆశించండి. లేదా మీలాగే కనిపించే వారిని ఆశించండి” అని అర్థం వచ్చేలా కింది పోస్టర్లో రాసుకుంటూ వచ్చారు. బింబిసార చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సీతారామం తో పాటుగా విడుదలై చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరి ఇచ్చింది.

ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్
తన కెరీర్ ప్రారంభం నుంచి కళ్యాణ్ రామ్ విభిన్నమైన సినిమాల్లో నటించాడు. అతనొక్కడే, హరే రామ్, ఓం, ఎమ్మెల్యే, 116 వంటి సినిమాలు అతనిలో ఉన్న విలక్షణమైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా! నటి స్తుండడం వల్ల కళ్యాణ్ రామ్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన బింబిసారతో ఆ అంచనాలను కళ్యాణ్ రామ్ అందుకున్నాడు. తాజాగా అమిగోస్ అనే చిత్రానికి పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమా ప్రచార పోస్టర్ లో చూపించిన చిత్రాల ఆధారంగా ఇది ఒక థ్రిల్లర్ జోనర్ అని అర్థమవుతుంది. పోస్టర్లో కనిపించే మూడు పాత్రల్లో ఒకదాంట్లో నీట్ గా, ఒకదాంట్లో రఫ్ లుక్ లో, ఇంకో చిత్రంలో చేతిలో తుపాకీతో కనిపిస్తున్నాడు. ఈ ప్రకారం ఈ మూడు పాత్రలు వేటికి అవే భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఒకవేళ ఈ సినిమా కనుక ప్రేక్షకులను అలరిస్తే కళ్యాణ్ రామ్ పంట పండినట్టే.