Homeజాతీయ వార్తలుGandipet Lake: గండిపేట ఖరాబైంది.. మంచినీటి చెరువును పాడు చేశారు..!

Gandipet Lake: గండిపేట ఖరాబైంది.. మంచినీటి చెరువును పాడు చేశారు..!

Gandipet Lake: విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ దాహారి‍్త తీర్చే జల వనరుల్లో గండిపేట సరస్సు – ఉస్మాన్‌సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గండిపేట సరసుస క్రమంగా మురికి కూపంగా మారుతోంది. చెత్తచెదారం నిర్వహణలో అధికారులు విఫలం కావడంతో కాలుష్యమయమవుతోంది. సరస్సు పరిసర గ్రామాలు పరీవాహక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో నీటి వనరులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలతో నిండిపోయాయి. గండిపేట సరస్సు చుట్టూ చెత్తను డంపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వరదను అరికట్టేందుకే..
చారిత్రాత్మకమైన రిజర్వాయర్ కేవలం తాగునీటి వనరుగా కాకుండా 1908లో సంభవించిన భయంకరమైన వరదల తర్వాత ఆరవ నిజాం నగరాన్ని వరద మంచెత్తకుండా ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. ప్రస్తుతం ఈ సరస్సు పరీవాహక ప్రాంతమంతా ఆక్రమణలకు గురవుతుండడంతో, చెత్త డంప్‌ చేస్తుండడంతో నగరానికి మళ్లీ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రక్షణగా నిలిచిన జీవో 111
ప్రత్యేకించి జీవో 111 తో జంట జలాశయాలకు (ఉస్మాన్‌సాగర్ మరియు హిమాయత్‌సాగర్) కొంత రక్షణ కల్పించింది. ఇటీవలే దీనిని ప్రభుత్వం రద్దు చేసింది. ఎలాంటి మాస్టర్‌ ప్లాన్‌ లేకుండానే నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తున్నారు. దీంతో అతి త్వరలోనే విపత్తు తప్పదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిజర్వాయర్స్ అండ్ లేక్స్(వాటర్ డొమైన్) సాంకేతిక సభ్యుడు బీవీ.సుబ్బారావు హెచ్చరిస్తున్నారు.
సరస్సులోకి మురుగునీరు చేరడం, నిర్మాణ వ్యర్థాలను పరీవాహక ప్రాంతంలో డంప్‌ చేయడం, సరస్సుకు ఆనుకుని కొత్త పార్కు రావడంతో నీటి కుంటలో చెత్తాచెదారం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. అక్రమార్కులపై అధికారులు పెద్దఎత్తున జరిమానాలు విధించి ప్రాథమిక పౌర జ్ఞానాన్ని పెంపొందించి చర్యలు తీసుకోవాలని జానపాడు గ్రామానికి చెందిన ప్రజా ఉద్యమకారుడు కళ్యాణ్ మూర్తి కోరుతున్నాడు.

వందకుపైగా ఆక్రమణలు..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) మ్యాప్‌ల ప్రకారం, ఎఫ్‌టిఎల్ పరిధిలోనే 100కి పైగా ఆక్రమణలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో అనేక కాంపౌండ్‌ వాల్స్‌, ఫెన్సింగ్‌లు, ఫాంహౌస్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారని, ఇవి ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ఆక్రమణలుగా ఉన్నాయని పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలసుబ్రహ్మణ్యం అనే కార్యకర్త తెలిపారు. అయితే అధికారులు మాత్రం సరస్సు రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే పార్క్, వాకింగ్ ట్రాక్‌ నిర్మాణంతోపాటు పలు సుందరీకరణ పనులు పూర్తి చేసినట్లు పేర్కొంటున్నారు. పునరుజ్జీవన ప్రణాళిక సరస్సు యొక్క రక్షణను నిర్ధారిస్తుంది మరియు బోటింగ్, సైక్లింగ్ వంటి అనేక సౌకర్యాలతో ఈ ప్రదేశాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా ప్రోత్సహిస్తుందని హెచ్‌ఎండీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular