
దాదాపు 200 ఏళ్లపాటు భరత భూమిని పాలించారు ఆంగ్లేయులు. ఎవడు వాడు? ఎచటి వాడు? ఇటు వచ్చిన తెల్లవాడు? అంటూ.. భారతీయులు ఉద్యమించారు. క్విట్ ఇండియా అంటూ బ్రిటీష్ వాడు వెళ్లిపోవాలని పోరు సాగించారు. దశాబ్దాలపాటు సాగిన సుదీర్ఘపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఎంతో మంది ప్రాణత్యాగానికి సార్థకత లభించింది. 1947 ఆగస్టు 14 ఆంగ్లేయులు స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. అయితే.. ఈ ఉత్సవాల్లో మాత్రం మహాత్మ గాంధీ పాల్గొనలేదు.
దీనికి కారణం ఏమంటే.. దేశానికి స్వతంత్రం లభించిన రోజున గాంధీజీ ఢిల్లీలో లేరు. బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. కారణం.. అక్కడ హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలు జరుగుతుండడమే. ఆ దారుణాన్ని అడ్డుకోవడానికి నిరాహారదీక్ష చేపట్టారు గాంధీ. ఈ క్రమంలో.. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించడం ఖాయమనే సమాచారం జవహర్ లాల్ నెహ్రూకు అందింది. దీంతో.. వల్లభాయ్ పటేల్ తో కలిసి గాంధీకి లేఖరాశారు.
భారతదేశపు తొలి స్వాతంత్ర దినం ఆగస్టు 15 అవుతుంది. ఆ ఉత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. దీనికి గాంధీ సమాధానం ఇస్తూ.. బెంగాల్లో హిందూ, ముస్లింలు మతం పేరుతో ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు.. నేను సంబరాలు ఎలా జరుపుకోగలను? ఈ ఘర్షణలు ఆపడమే తన తొలి కర్తవ్యం అంటూ సమాధానం ఇచ్చారు. ఆ విధంగా.. దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకున్నదికానీ.. గాంధీజీ మాత్రం ఆ వేడుకల్లో పాల్గొనలేదు.
ఇక ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రే.. వైస్రాయ్ లాంజ్ గా పిలుచుకున్న ప్రస్తుత రాష్ట్రపతి భవన్ నుంచి నెహ్రూ తన చారిత్రక స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఇచ్చారు. ఆగస్టు 15న మంత్రిమండలి జాబితాను నెహ్రూ అప్పటి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కు అందించారు. ఇక, భారత జాతీయ జెండాను మాత్రం ఆగస్టు 16వ తేదీన ఎర్రకోటపై నెహ్రూ ఎగురవేశారు.