Ganapati Mandapalu: అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ రాస్తే.. నవరాత్రి మండపం.. చవితి పూజ.. గణపతి ఉత్సవం.. కాదేదీ ప్రచారానికి అనర్హమని రాజకీయ నాయకులు నిరూపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో వినాయక చవితి పండుగను తమకు ఓట్లు రాల్చే అస్త్రాలుగా రాజకీయ నాయకులు మలుచుకుంటున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో సమరయోధులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు బాలగంగాధర తిలక్ గణేష్ మండపాలను ఏర్పాటు చేసే సంస్కృతిని ప్రారంభిస్తే.. ఇప్పుడు రాజకీయ నాయకులు తమ ఎన్నికలకు ప్రచారానికి అనుకూలంగా గణేష్ మండపాలను మార్చుకుంటున్నారు.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ తమకే పక్కా అని అనుకుంటున్నావా గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీలకు తాయిలాలు, నజరానాలు ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్క మండపానికి ఐదు నుంచి పదివేల దాకా చెల్లిస్తున్నారు. ఇలా కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు.. ప్రజా ప్రాతినిధ్యం చట్టం_ 1951 ప్రకారం ఇలాంటి చర్యలు అనర్హత వేటుకు దారి తీసే అవకాశాలు ఉన్నప్పటికీ.. నేతలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా డబ్బు కుమ్మరిస్తున్నారు. కొందరు నేరుగా విరాళాలు ఇస్తుండగా.. మరికొందరు తమ తాతలు, స్మారక కమిటీల పేరుతో ఆ పని కానిస్తున్నారు.”చిత్తం గణపతి మీద.. భక్తి ఓట్ల మీద ” అనే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరా, శరన్నవరాత్రులు, ఆపై దీపావళి కూడా ఓటర్లపై తాయిలాల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
వాస్తవానికి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని. మిగతా సమయంలో గణపతి నవరాత్రులు నిర్వహించేవారు.. భక్తులు ఇచ్చే చందాలతో ఆ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ రాష్ట్రంలో వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు గణపతి మండపాలపై వాలిపోతున్నారు. ఖర్చు ఏమాత్రం ఇబ్బందు లేకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ శాసనసభ్యులు ఈ ఖర్చు విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా తామేమి తక్కువ కాదని డబ్బులు కుమ్మరిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నూ టికెట్ తమకే అనుకుంటున్న నేతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎమ్మెల్యేలు ఒక్కొక్క మండపానికి గరిష్టంగా 10,000, కనిష్టంగా 5000 వరకు ఇస్తున్నారు. వీటికి తోడు అన్నదానాలు, మండపాల వద్ద ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గణేష్ మండపాల వద్ద సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమకు వీలుకానిచోట్ల కుటుంబ సభ్యులను, అనుచరులను పంపుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఈ తాయిలాల భారం ఎక్కువగా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు స్థానిక కార్పొరేటర్లను కలుపుకొని పోయి డబ్బు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఏకంగా కోటి 20 లక్షల వరకు గణేష్ మండపాల నిర్వాహకులకు పంపిణీ చేశారు. తన నియోజకవర్గంలో 1200 దాకా మండపాలున్నాయి. ఏ ఒక్క మండపాన్ని మిస్ కానివ్వకుండా ఆ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా డబ్బు పంపిణీ చేశారు. నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు నేరుగా విగ్రహాలను కొనుగోలు చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న ఓ వ్యక్తి ఏకంగా 1000 మండపాల నిర్వాహకులకు భారీ విగ్రహాలు అందించాలని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కొక్క మండపానికి 5000 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే తన సోషల్ మీడియా టీం ద్వారా విగ్రహానికి 3000 పైగా అందిస్తూ.. కమిటీలకు అదనంగా క్యారం బోర్డులను పంపిణీ చేస్తున్నారు. ఇక ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యే 2000 చొప్పున విరాళం ఇచ్చినట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో డబ్బులు కాకుండా ప్రతి కమిటీ వద్ద అన్నదానం చేసే బాధ్యతను అధికార పార్టీ అభ్యర్థులు ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదే తంతు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో అన్నదానాలతో పాటు ఆలయ కమిటీలకు పదివేల చొప్పున ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తానికి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎన్నికల ప్రచార వేదికలుగా మారిపోయాయి.