
Huzurabad Dalit Bandu: చరిత్రలో ఎన్నో పథకాలు వచ్చాయి.. పోయాయి. కొన్ని భారమై పాలకులే వదిలేశారు. తెలంగాణలో గద్దెనెక్కాక కేసీఆర్ తలపెట్టిన‘దళితులకు మూడు ఎకరాలు’ ఆచరణలో సాధ్యం కాక వదిలేశారు. దాని స్థానంలోనే వచ్చింది ‘దళితబంధు’. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమం కేవలం హూజూబాద్ ఎన్నికల కోసమేనా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా విన్పిస్తోంది. కేసీఆర్ ను ఎదురించి బయటకొచ్చిన ఈటల రాజేందర్ ను హూజూరాబాద్లో ఎదుర్కొనేందుకు తెరపైకి తెచ్చిన బ్రహ్మస్త్రంగా దళితబంధు కార్యక్రమాన్ని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.
త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే ఈ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా హూజూరాబాద్లో దళితబంధు వంటి భారీ కార్యక్రమాన్ని కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. ఈటల గెలిస్తే మరిన్ని గళాలు లేస్తాయి. కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతాయి. అందుకే ఈటలను ఓడించి అందరి నోళ్లు మూయించాలన్నదే కేసీఆర్ తాపత్రయంగా చెబుతున్నారు.
హూజారాబాద్ నియోజకవర్గంలో దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి ఓట్లను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారనే టాక్ విన్పిస్తుంది. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు సైతం గతంలో సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాయి.
దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రకటించిన 10వేల వరదసాయం ఆ తర్వాత దిక్కుముక్కు లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ చెబుతున్న దళితబంధు పథకం కూడా కేవలం హూజూరాబాద్ ఎన్నికల వరకే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హూజూరాబాద్లో ప్రవేశపెట్టిన దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నిక సైతం ఆలస్యం అవుతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ మరో నాలుగు నిజయోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు దళితబంధు పథకం కొనసాగింపు హూజూబాద్ ఎన్నికల ఫలితంపై ఆధారపడి ఉంటుందని సీఎం కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ‘టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని.. సన్యాసుల మఠం కాదని.. డెఫినెట్ గా ఫలితం ఆశిస్తున్నామని’ కుండబద్ధలు కొట్టారు. ఇక్కడ గెలిస్తే దశల వారీగా దళితబంధు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పకనే చెప్పారు.
అయితే దళితబంధు లాంటి బృహత్తర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యకాదనే నిపుణులు అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా లేదా ఓడినా ఈ కార్యక్రమాన్ని అధ్యయనం పేరిట వచ్చే ఎన్నికల వరకు సాగదీసే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని టీఆర్ఎస్ చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం భవిష్యత్ అనేది హూజూరాబాద్ రిజల్ట్ పైనే ఆధారపడి ఉందనే మాట విన్పిస్తుంది.