ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖాస్ర్తాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వరుసగామూడు లేఖలు రాసిన ఎంపీ తాజాగా నాలుగో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వ హామీని నెరవేర్చలేదని తాజా లేఖలో పేర్కొన్నారు. హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని రఘురామ గుర్తుచేశారు.
ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీ కారణంగానే ఎన్నికల్లో నిరుద్యోగులు వైసీపీకి మద్దతునిచ్చారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూశారు. ఎన్నికల ప్రచారంలో మెగా డీఎస్సీ పై కూడా జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న హామీ ఇప్పటికి నెరవేర్చలేదన్నారు. తన లేఖను అత్యవసరంగా పరిగణనలోకి తసుకుని ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని కోరారు.
ఇదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, షెకావత్, జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లను కలిశారు. బెయిల్ రద్దు టెన్సన్ తోనే జగన్ ఢిల్లీ బాట పట్టారని ప్రత్యర్థులు విమర్శించినా రాష్ర్ట ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లానని వైసీపీ నేతలు చెబుతున్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే పలుమార్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై వేటు వేయాలని స్పీకర్ కు సమర్పించిన ఫిర్యాదులో ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. అయితే రఘురామ మాత్రం తాను ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని ధీమాగా ఉన్నారు. ఈనేపథ్యంలో మునుముందు జగన్ సర్కారు వర్సెస్ రఘురామపోరు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాల్సిందే.