కేంద్రంతో జగన్ మైత్రినే కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు బీజేపీని విమర్శించిన టీడీపీ కూడా సైలెంట్ అయిపోయింది. రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితి ఎటు తిరిగి ఎటు వస్తుందో అన్న ఆలోచనతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు బాబు. కేంద్రంతో పనులు చేయించుకోవాలి కాబట్టి.. మోడీకి సాఫ్ట్ కార్నర్ ను చూపిస్తున్నారు జగన్. ఈ మధ్య కరోనాతో పోరులో ప్రధానికి అండగా నిలవాలని ట్వీట్ కూడా చేశారు. అయితే.. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో దేశరాజకీయాల్లో చంద్రబాబు చక్రాలు తిప్పారు. అయితే.. ఇప్పుడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎలా అనే విషయం మీదనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే మరోసారి బీజేపీతో జతకట్టాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయన మోడీని పల్లెత్తు మాట అనట్లేదని అంటున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే.. మోడీ యాంటీ గ్రూపులోకి బాబును పరిగణనలోకి తీసుకోవట్లేదని అంటున్నారు విశ్లేషకులు.
బీజేపీ – కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా గ్రూపును తయారు చేయాలని మమత, స్టాలిన్, శరద్ పవార్ వంటివారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపులోకి బాబు కన్నా.. జగనే బెటర్ అని భావిస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ సర్కారు మీద భారీ వ్యతిరేకత ఏమీ కనిపించట్లేదని మోడీ యాంటీ గ్రూపు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే.. ఆయన్ని తమలో కలిపేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. మమత జగన్ కు లేఖ రాయడం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందని ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి.. ఎవరినీ దూరం చేసుకోవద్దని చూస్తున్నారట జగన్. మోడీ వేవ్ కూడా ఎలా ఉంటుందో తెలియనందున.. మూడో ప్రత్యామ్నాయానికీ టచ్ లో ఉండేలా చూసుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా.. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిన చేసిన వ్యాఖ్యలు ఈ కోణంలోనే చూడాలని అంటున్నారు. దేశంలో యాంటీ బీజేపీ శిబిరం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పడం గమనించాల్సిన విషయం. దీన్ని బట్టి.. ఈ గ్రూపులో వైసీపీ చేరడాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.