Friendship Day 2024: స్నేహానికన్న మిన్న లోకాన లేదు. చీకటి పడితే మన నీడ కూడా మనలిన విడిచి వెళ్తుంది. కానీ ప్రతీక్షణం తోడుండేది నిజమైన స్నేహితుడే. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమ్మా నాన్న తర్వాత అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది స్నేహితుడికే. నిజమైన స్నేహితుడు కష్టాల్లో, సుఖాల్లో తోడుగా ఉంటారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. అందుకే స్నేహితుడికి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం ఉంది. మన దేశంలో ఏటా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్‌డే జరుపుకుంటాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా మాత్రం జూలై 30న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి జూలై 30వ తేదీని ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది. కానీ మనదేశంలో మాత్రం ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
ఎలా మొదలైందంటే..
మదర్స్‌డే, ఫాదర్స్‌డే, బ్రదర్స్‌డే, సిస్టర్స్‌డే, లవర్స్‌డే.. ఇలా అన్ని బంధాలకు ఒక రోజు ఉన్నట్లుగానే స్నేహానికి కూడా ఒక రోజు ఉంది. హాల్మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు హిస్టరీ జాయిస్ హాల్ స్నేహానికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక రోజును కేటాయించాలని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి జూలై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించడంతో ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలకు ఇది స్ఫూర్తినిస్తుందని, సమాజాల మధ్య వారధులను నిర్మిచగలదని ఐక్యరాజ్య సమితి 2011లో జూలై 30ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. స్నేహం, దాని ప్రాముఖ్యత గురించి ప్రజల మధ్య సంభాషణను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇతర సామాజిక సమూహాలను ఈవెంట్లు, పోటీలు, ఇతర కార్యకలాపాలను నిర్వహించమని ఐక్యరాజ్యసమితి ప్రోత్సహిస్తుంది.
స్నేహానికి గౌరవం..
ఇక స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం వలన మన జీవితంలో వారు పోషిస్తున్న విలువైన పాత్రను గౌరవిస్తుంది. అలాగే గుర్తిస్తుంది కూడా. బంధాలను బలోపేతం చేయడానికి, స్నేహాలు తీసుకువచ్చే ఆనందాన్ని జరుపుకోవడానికి ఒక అవకాశంగా ఈ ఫ్రెండ్షిప్ డే పనిచేస్తుంది. ఈ రోజున ప్రజలు సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున తన స్నేహితులకు ఇష్టమైన సందేశాలను పంపుతారు. స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు. మన జీవితాలను సుసంపన్నం చేసే సంబంధాలలో స్నేహితులు భాగమే.
మన దేవంలో 1990లోనే..
స్నేహితుల దినోత్సవం సామాజిక సామరస్యం ప్రోత్సహిస్తుంది. స్నేహితులపట్ల కృతజ్ఞత, ఆప్యాయత, ప్రేమను చూపించేందుకు స్నేహితుల దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. మనదేశంలో 1990లో గ్రీటింగ్ కార్డు కంపెనీలు ఫ్రెండ్షిప్ డేని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే కాన్సెప్ట్‌ను మొదటగా 1958లో పరాగ్వేలో స్థాపించారు. అప్పటి నుంచి అన్ని దేశాలకు వ్యాపించింది. తరువాత దీని విలువను తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి 2011లో దీన్ని అధికారికంగా గుర్తించింది.