https://oktelugu.com/

Jammu and Kashmir: కశ్మీర్‌లో విరుచుకుపడ్డ ఉగ్రమూకలు.. ఆర్మీ పికెట్‌పై విరుచుకుపడ్డ ముష్కరులు.. తిప్పి కొట్టిన సైన్యం.. కేంద్రం అలర్ట్‌!

జమ్మూ కశ్మీర్‌లో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత వరుస దాడులతో విరుచుకుపడుతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే ఐదారు దాడులు చేశారు. ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 22, 2024 / 12:15 PM IST

    Fresh Terror Attack in Rajouri

    Follow us on

    Jammu and Kashmir: మూడు నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దాదాపు నెల రోజులుగా లోయలో దాడులకు తెగబడుతున్నారు. చొరబాట్లు కూడా పెరుగుతున్నాయి. ఆర్టిక్‌ 370 రద్దు తర్వాత తీసుకున్న చర్యలో కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో కశ్మీర్‌లో పెట్టుబడులు కూడా పెరిగాయి. కశ్మీర్‌ ప్రజలు కూడా ప్రశాంతంగా జీవనం సాగించారు. పర్యాటకుల సందడి కూడా పెరిగింది. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే పీవోకేను భారత్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు కశ్మీర్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల వ్యవధిలో ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలపై కాల్పులు జరుపుతున్నారు. గ్రెనేడ్‌లతో దాడి చేస్తున్నారు. తాజాగా సైనిక పికెట్లపై పెద్ద ఎత్తున దాడికి దిగారు. ఈ దాడిని సరిహద్దు భధ్రత దళానికి చెందిన జవాన్లు తిప్పికొడుతున్నారు. కాల్పులతో ఈ ప్రాంతం మొత్తం హోరెత్తిపోతోంది. ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అదనపు బలగాలను సంఘటన ప్రాంతానికి తరలిస్తోంది.

    పాకిస్తాన్‌ సరిహద్దులో కాల్పులు..
    జమ్మూకశ్మీర్‌లోని భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉన్న రాజౌరీ సెక్టార్‌ గుంధా ఏరియాలో తాజాగా సైనిక పికెట్‌పై దాడి జరిగింది. ఉగ్రవాదుల దాడి విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఆర్మీ పికెట్‌పై టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు జమ్మూ డిఫెన్స్‌ పీఆర్వో వెల్లడించారు. కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

    భారత్‌లోకి చొరబడి..
    సోమవారం(జూలై 22) సాయంత్రం 4 గంటలకు జవాన్లు గుంధా ఏరియాలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒక జవాన్‌ గాయపడ్డాడు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడినట్లు అందిన సమాచారంతో జవాన్లు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

    మూడో అతిపెద్ద దాడి..
    ఇదిలా ఉండగా నెల రోజులుగా కశ్మీర్‌లో దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు వారాల వ్యవధిలో జమ్మూ క శ్మీర్‌లో జరిగిన మూడో అతిపెద్ద దాడి ఇది. కొద్దిరోజుల కిందటే ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కమాండర్‌ స్థాయి అధికారి ఉన్నారు. అంతకు ముందు వారం కథువా జిల్లాలలో కూడా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ ట్రక్కుపై గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

    32 నెలల్లో 48 మంది మృతి..
    ఇదిలా ఉండగా, జమ్మూ కశ్మీర్‌లో గడిచిన 32 నెలల్లో టెర్రరిస్టుల దాడిలో 48 మంది సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదుల ఏరివేతకు సైనికులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. పాకిస్తాన్‌ మద్దతులో దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు కశ్మీర్‌లో అంశాతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైనిక చర్యలతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఉగ్రవాదులను ఏరివేస్తోంది.