Women Free Bus Travel: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు శుభవార్తను అందించింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్సిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ తెలిపారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.
9 నుంచి ఉచిత ప్రయాణం..
డిసెంబర్ 09 2023 తేదీ నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అయితే ఆధార్ కార్డ్ చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేశారు మంత్రి. తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేశారు. ఇక మంత్రి చేసిన ప్రకటనతో మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. హామీలు ప్రకటించి అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు మూడు రకాల పథకాలు కేటాయించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయంతో పాటు 500 రూపాలయకు గ్యాస్ సిలిండర్.. అలానే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోనియా పుట్టిన రోజున..
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బర్త్ డేని పురస్కరించుకుని డిసెంబర్ 09 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు హామీలను సోనియా బర్త్ డే కానుకగా అమలు చేస్తామని తెలిపారు. ఈ రెండు గ్యారంటీలపై సంబంధిత అధికారులతో శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.