Free Bus Travel In Karnataka: ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంపై కర్ణాటకలో కొత్త సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రజల నుంచే ఈమేరకు తిరుగుబాటు వస్తోంది. ఇదే సమయంలో విపక్ష బీజేపీ కూడా ప్రజలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు డిమాండ్ పెరుగుతోంది. అయిత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే పథకానికి సంబంధించి ఇంకా గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం నిబంధనలు విధించిందని ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను కట్టే వారికి వర్తించదు అంటూ ఒక పది నిబంధనల గురించి ఈ పోస్టులో ప్రస్తావించారు.
హామీలు ఇవీ..
కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే వివిధ రంగాలలో తాము చేయబోయే పనులకు సంబంధించి ఒక సంక్లిప్తమైన మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రతీ కుటుంబంలోని మహిళా పెద్దలకు గృహలక్ష్మి స్కీం కింద రూ. 2 వేలు, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువనిధి పథకం కింద గ్రాడ్యుయేషన్ చేసిన యువతకు ప్రతీనెల రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లు రూ.1,500 అందించడం, మొదలైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించేలా శక్తి అనే పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.
గృహలక్ష్మి, గృహ జ్యోతికి ఆమోదం..
ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ మొదటి కాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి పథకాల అమలుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కర్ణాటకకు చెందిన మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా బీఎంటీసీకి చెందిన నాన్–ఏసీ బస్సులు, రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు.
విడుదల కాని గైడ్‌లైన్స్..
ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కాబినెట్ ఒక సూత్రప్రాయ ఆమోదం తెలిపిందే తప్ప, ఈ పథకాలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళిక/నిబంధనలు ఇంకా రూపొందించలేదు. ఇప్పటికి వరకు కర్ణాటక ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి ఒక ప్రణాళికను విడుదల చేయలేదు.
సోషల్ మీడియాలో నిబంధనలు..
ప్రభుత్వం ఉచిత ప్రయాణానికి నిబంధనలు విధించింది అంటూ కొన్ని నిబంధనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిబంధనలపై కర్ణాటక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1. పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
2. 18–60 ఏళ్ళ మధ్య వయసు వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
3. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తించదు.
4. ఇన్‌కమ్ టాక్స్ కట్టే మహిళలకు ఇది వర్తించదు.
5. పిల్లలు విదేశాల్లో తల్లులకు ఈ పథకం వర్తించదు.
6. రెండు సొంత ఇల్లు కలిగిన కుటుంబ మహిళలకు ఇది వర్తించదు.
7. 5 ఎకరాల కన్నా ఎక్కువ సొంత భూమి కలిగిన మహిళలకు ఇది వర్తించదు.
8. 25 వేలకు మించి జీతం తీసుకునే ప్రైవేట్ ఉద్యోగం చేసే మహిళలకు వర్తించదు.
9. ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చదివించే మహిళలకు వర్తించదు.
10. ఏదైనా ప్రభుత్వ ఉచిత నగదు పథకంలో భాగస్వాములు అయిన మహిళలకు ఇది వర్తించదు.
మరి ఈ నిబంధనలపై ప్రభుత్వం స్పందించలేదు. నిజమో కాదో చెప్పాలని కర్ణాటక ప్రజలు కోరుతున్నారు.
Recommended Video: