Former Punjab DGP Case: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోని ఓ తండాలో ఓదంపతులు తమ కుమారుడికి పెళ్లి చేశారు. మొదట్లో వారిద్దరి సంసారం బాగానే జరిగింది. ఆ తర్వాతే కోడలు, మామ మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది. కొంతకాలం పాటు అది గుట్టుగానే సాగింది. ఆ తర్వాత అసలు వ్యవహారం వెలుగులోకి రావడంతో కొడుకు మందలించాడు. దీంతో ఆ మామ, కోడలు కలిసి పారిపోయారు. కొంతకాలం పాటు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో స్వగ్రామానికి బయలుదేరారు. స్వగ్రామంలో ముఖం ఎత్తి చూపించే ధైర్యం లేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం నగరంలోనే కాదు, తెలంగాణలోనే ఆ సంఘటన సంచలనం సృష్టించింది..
ఇప్పుడు ఇదే తరహా ఘటన పంజాబ్లో జరిగింది.. కాకపోతే ఇక్కడ మామ, కోడలు కాకుండా.. ఆ మామ కుమారుడు చనిపోయాడు.. అంతేకాదు తన తండ్రి వల్ల తాను ఏ స్థాయిలో నరకం చూసాను సభ్య సమాజం దృష్టికి తీసుకెళ్లి మరీ కన్నుమూశాడు.. పంజాబ్లో మాజీ డిజిపి మహమ్మద్ ముస్తఫా ఇంట్లో జరిగిన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముస్తఫా కుమారుడు అఖిల్ అక్తర్ ఇటీవల కన్నుమూశాడు. మొదట్లో అతని మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ కేసు అనేక మలుపులు తిరిగింది. తన భార్యతో తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని అఖిల్ ఆరోపించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
పంచకుల ప్రాంతంలో అక్టోబర్ 16న అఖిల్ అనే 33 సంవత్సరాల యువకుడు తన ఇంట్లో స్పృహ కోల్పోయాడు. అచేతన స్థితిలో కనిపించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. మత్తు పదార్థాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే అఖిల్ చనిపోయాడని అతడి తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. అఖిల్ తండ్రి మాజీ డిజిపి కావడంతో పోలీసులు కూడా దానిని నిజం అనుకున్నారు. అంతేకాదు అఖిల్ కు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు పోలీసులకు మాజీ డిజిపి చెప్పడంతో.. వారు కూడా ప్రాథమికంగా అదే నిర్ణయానికి వచ్చారు. అఖిల్ తండ్రి పేరు ముస్తఫా.. ఈయన గతంలో డిజిపిగా పని చేశారు. అఖిల్ తల్లి పేరు రజియా సుల్తానా గతంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. అయితే అఖిల్ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు అతని ప్రాణ స్నేహితుడు పోలీసులను కలిశాడు.. తనకు ఉన్న అనుమానాలను పోలీసులతో పంచుకున్నాడు. ఇదే సమయంలో ఆగస్టు 27న అఖిల్ ఒక వీడియోను రికార్డ్ చేశాడు. అది బయటికి రావడంతో ఈ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
” నా భార్య కు, తండ్రికి అనైతిక సంబంధముంది. ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి మానసికంగా కృంగిపోయాను. ఈ వ్యవహారం మొత్తం మా ఇంట్లో తెలుసు. నన్ను పిచ్చోడిలా చేయడానికి మా ఇంట్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంతం చేయడానికి అనేక పర్యాయాలు ప్రయత్నించారు. తప్పుడు కేసులో ఇరికించడానికి తెర వెనుక కుట్రలకు శ్రీకారం చుట్టారు. నా తండ్రి మాత్రమే కాదు, తల్లి, సోదరి కూడా ముఖ్యపాత్ర పోషించారని” అఖిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పంజాబ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.