Pawan Kalyan- Former MP Badiga Ramakrishna: ఏపీలో ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు జనసేన వైపు చూస్తున్నాయి. తటస్థులు, విద్యాధికులు సైతం మొగ్గుచూపుతున్నారు. గతంలో వివిధ పార్టీల్లో పదవులు చేపట్టి రాజకీయాలకు దూరంగా ఉన్న వారు సైతం జనసేనలో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. గతంలో రాజకీయంగా ప్రభావం చూపిన వారు వివిధ కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారందరూ ఇప్పుడు జనసేన ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పవన్ ను కలిసి తమ మనసులో ఉన్న మాటను బయటపెడుతున్నారు. తాజాగా పవన్ మంగళగిరిలో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సమావేశంలో సైతం పార్టీ చేరికల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో పవన్ బస్సు యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో పార్టీలో చేరికలకు అదే సమయాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు వరుసపెట్టి వివిధ పార్టీల నాయకులు పవన్ ను కలుస్తుండడం జనసేన శ్రేణుల్లో జోష్ నింపుతోంది.

తాజాగా మంగళగిరి పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదరిన పవన్ కు ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామక్రిష్ణ పవన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కు ఎదురెళ్లి మరీ రామక్రిష్ణ స్వాగతం పలికారు. పవన్ కూడా ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు. దీంతో బాడిగ జనసేనలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. అసలు పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారా? లేకుంటే జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అన్న కొత్తచర్చ మొదలైంది. బాడిగ రామక్రిష్ణ కాంగ్రెస్ సీనియర్ నేత. 2004 లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 2009లో మాత్రం కొనకళ్ల నారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
గత ఎన్నికలకు ముందు రామక్రిష్ణ కుమార్తె శ్రీదేవి టీడీపీలో చేరారు. పెడన టిక్కెట్ ఆశించారు. కానీ దక్కలేదు. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ సారి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. కానీ టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రామక్రిష్ణ పవన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా తాను కానీ.. తన కుమార్తెకానీ పోటీచేయాలని రామక్రిష్ణ భావిస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో లైన్ క్లీయర్ చేసుకోవడానికే ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిని నిజం చేస్తూ ఆయన పవన్ కలుసుకోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఇప్పటికే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణను పార్టీ డిసైడ్ చేసింది. తాజాగా బాడిగ రామక్రిష్ణ జనసేన వైపు అడుగులు వేస్తుండడంతో ఇక్కడి రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

అయితే ఒక్క బాడిగ రామక్రిష్ణే కాదు. గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లంరాజు సైతం త్వరలో జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయిస్తారన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ రాజకీయ పరిణామాలతో అదే పార్టీలో చాలామంది కొనసాగుతూ వచ్చారు. వారంతా ప్రత్యామ్నాయ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి వారికి పవన్ ఒక ఆశాదీపంగా కనిపిస్తున్నారు. త్వరలో వారంతా జనసేన గూటికి చేరుతారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.