Vatti Vasantha Kumar : మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ కన్నుమూశారు. వసంత్ కుమార్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. చనిపోయే వరకూ అదే పార్టీలో కొనసాగారు. కానీ రాజకీయంగా యాక్టివ్ గా లేరు.ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. 2004, 2009లో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్సార్ తో పాటు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ విశాఖలో నివాసముంటున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.

వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. వైఎస్ ప్రోత్సాహంతో పశ్చిమగోదావరి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తొలిసారిగా 2004లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అటు తరువాత కిరణ్ హయాంలో మంత్రిగా ఎంపికైనా పోర్టుపోలియో విషయంలో అప్పట్లో వార్తలకెక్కారు. దీంతో కిరణ్ టూరిజం శాఖను అప్పగించారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో వట్టి పార్టీలో కొనసాగుతున్నా ఏమంత యాక్టివ్ గా లేరు. అలాగని పార్టీకి రాజీనామా చేయలేదు. అడపాదడపా ఆ మధ్య కాపు సమావేశాలకు సైతం వట్టి వసంత్ కుమార్ హాజరయ్యేవారు. కాపులు రాజకీయంగా ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్న నాయకుల్లో వసంత్ కుమార్ ఒకరు.
ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పూండ్ల.ప్రస్తుతం వసంత్ కుమార్ విశాఖలో నివాసముంటున్నారు. అనారోగ్యంబారిన పడడంతో విశాఖలో ఉంటూ వైద్యసేవలు పొందుతూ వస్తున్నారు. మూడేళ్ల కిందట ఆయన సతీమణి అనారోగ్యంతో కన్నుమూశారు. వీరికి పిల్లలు లేరు. సమీప బంధువుల్లో ఒకర్ని దత్తత తీసుకున్నారు. భార్య అకాల మరణంతో వసంత్ కుమార్ ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. ఇటీవల విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ వసంత్ కుమార్ మృతిచెందారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.