Konathala Rama Krishna: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దూకుడు పెంచారు. రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్నది తెలియాల్సి ఉంది. వైసీపీలో మాత్రం చేరరని తెలుస్తోంది. టిడిపి కానీ.. జనసేనలో కానీ కొణతాల చేరతారని.. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి. 2024 నూతన సంవత్సరాన్ని వేదికగా చేసుకుని.. మీడియాను పిలిచి మరీ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ సర్కార్ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లరని ధ్రువీకరించారు.
వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో కొణతాల రామకృష్ణ ఒకరు. 2004లో రాజశేఖర్ రెడ్డి కొణతాల రామకృష్ణ అన్ని విధాలా ప్రోత్సహించారు. అనకాపల్లి నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించారు. కీలక వాణిజ్య శాఖ మంత్రిగా తన క్యాబినెట్లో చోటు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు కొణతాల రామకృష్ణకు అగ్ర తాంబూలం ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మాత్రం కొణతాల ఓడిపోయారు. వైసీపీలో చేరినా ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు గా ఉన్న విజయమ్మను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడంలో కొణతాలదే కీలక పాత్ర. కానీ ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓటమితో కొణతాలను జగన్ సైడ్ చేశారు. గత ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ పార్టీలో చేరకుండా కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయంగా యాక్టివ్ కావాలని కొణతాల భావిస్తున్నారు. ఏదో ఒక పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఏపీలో జగన్ పాలన బాగాలేదని.. విశాఖకు పాలనా రాజధాని అవసరం లేదని తేల్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారని కూడా కొణతాల ఆరోపిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన టిడిపిలో చేరతారన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఆయనను టిడిపిలో చేర్పించాలని అయ్యన్నపాత్రుడు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇదే తరహా ప్రచారం వచ్చినా.. వివిధ రూపాల్లో ఎదురైన అడ్డంకులతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి టిడిపికి సరైన అభ్యర్థి అవసరం. అందుకే కొణతాలను పార్టీలోకి రప్పించి టికెట్ కట్ట పెట్టాలన్న యోచనలో టిడిపి హై కమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొణతాల వియ్యంకుడే అనకాపల్లి టిడిపి మాజీ ఎమ్మెల్యే కావడంతో… ఆయన తెలుగుదేశం పార్టీలో చేరికకు దోహద పడినట్లు తెలుస్తోంది. మరి కొణతాల ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.