Ex Minister Bojjala Gopala krishna Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో మధ్యాహ్నం 3.28 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు వైౖద్యులు ప్రకటించారు. ఆయన మరణవార్తతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. బొజ్జల చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచే స్నేహితుడు. రాజకీయంగా కూడా అండగా నిలిచారు. అటు తెలంగాణా సీఎం కేసీఆర్ తో సైతం బొజ్జలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించడంతో ఇప్పటికీ వారి మధ్య స్నేహ సంబంధాలున్నాయి. బొజ్జల అకాల మరణంపై సీఎం కేసీఆర్, చంద్రబాబులు సంతాపం తెలిపారు. తెలంగాణా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం.శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన బొజ్జల స్వస్థలం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా(ప్రస్తుత తిరుపతి) శ్రీకాళహస్తి మండలం ఊరందూరు. మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి, విశాలాక్షి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఐదుగురు కుమార్తె లు. కొడుకులిద్దరిలో గోపాలకృష్ణారెడ్డి పెద్దవాడు. 1949 ఏప్రిల్ 15న ఆయన జన్మించారు. తిరుపతిలో 1969లో బీఎస్సీ, చెన్నైలో 1972లో బీఎల్ పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్ లో వ్యాపారాలపై దృష్టి పెట్టారు.

శ్రీకాళహస్తి ఆలయ అభివ్రద్ధికి..
బొజ్జల తండ్రి 1967లో శ్రీకాళహస్తి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బొజ్జల సతీమణి బృందమ్మ తండ్రి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, వాయల్పాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి. ఆ నేపఽథ్యాన్ని బొజ్జల తన రాజకీయ ప్రస్థానంతో మరిం త సమున్నతం చేసుకున్నారు. శ్రీకాళహస్తి రాజకీయాల నుం చి తండ్రి గంగసుబ్బరామిరెడ్డి తప్పుకొన్నాక 1981లో శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సభ్యుడిగా గోపాలకృష్ణారెడ్డి ఎంపికయ్యారు.1984లో టీడీపీలో చేరిన ఆయనకు ఆ ఆల య ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని నాటి సీఎం ఎన్టీఆర్ కట్టబెట్టారు. ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగేలా శాశ్వత చర్యలు తీసుకున్నారు. ఇవాళ శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలకు ఇంతటి విశేష ప్రాచుర్యం ఉందంటే ఆయన తీసుకున్న చర్యల ఫలితమే! ముక్కంటి ఆలయ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఎన్టీఆర్.. బొజ్జల దక్షతకు ముగ్ధులయ్యా రు. 1989 ఎన్నికల్లో శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన గోపాలకృష్ణారెడ్డి వరుసగా 94, 99ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా ఆరు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి 2004లో తప్ప ఐదు పర్యాయాలు విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, నవ్యాంధ్రలో ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2001లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో డ్వాక్రా, ఐటీ, ఉపాధి శాఖల మంత్రిగా నియమితులయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమిత ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు ఆ క్రమంలో ఆ శాఖను బొజ్జలకు కేటాయించడం గమనార్హం. రాష్ట్రానికి తొలి ఐటీ మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఐదోసారి గెలిచిన ఆయనకు అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయి. అనారోగ్యం కారణంగా 2017 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కుమారుడు సుధీర్‌రెడ్డికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు.

చంద్రబాబు కంటే సీనియర్
తిరుపతిలో డిగ్రీ చదివే నాటి నుంచి బొజ్జలకు చంద్రబాబుతో స్నేహం మొదలైంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో గోపాలకృష్ణారెడ్డి చదవగా చంద్రబాబు ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. చంద్రబాబు కంటే ఏడాది సీనియర్. అయినా ఇద్దరి నడుమా స్నేహం చిగురించింది. చదువు పూర్తయ్యాక చంద్రబాబు రాజకీయాల్లో, గోపాలకృష్ణారెడ్డి వ్యాపారాల్లో నిమగ్నమైనా మైత్రీబంధం కొనసాగింది. అనారోగ్యంతో 2017లో బొజ్జల రాజకీయాల నుంచి తప్పుకొని హైదరాబాద్‌లో ఉంటున్నా.. చంద్రబాబు తరచూ కలసి పరామర్శిస్తూ వచ్చారు. టీడీపీలో 1995 ఆగస్టులో సంభవించిన పరిణామాలు తెలిసిందే. గోపాలకృష్ణారెడ్డి ఆ సంక్షోభంలో చంద్రబాబు పక్షాన కీలక పాత్ర పోషించారు. 2003 అక్టోబరు 1న నాటి సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్తుండగా అలిపిరి సమీపంలో ఘాట్ రోడ్డు లో నక్సలైట్లు క్లెమోర్ మైన్స్ పేల్చి న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కారులో చంద్రబాబుతో పాటు మంత్రిగా ఉన్న బొజ్జల కూడా ఉన్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.