Rahul Gandhi: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న గడిచిన తొమ్మిదేళ్లలో దేశంలో లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న ప్రధాని మోదీ తన మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను చిదిమేశారని ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
2014లో 16.93 లక్షల మంది ఉద్యోగులు..
ప్రభుత్వరంగం సంస్థలో తొమ్మిదేళ్ల క్రితం అంటే 2014 నాటికి 16.93 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 2022 నాటికి ఉద్యోగుల సంఖ్య 14.9 లక్షలకు పడిపోయిందన్నారు. బీఎస్‌ఎన్‌ఎన్‌ఎల్‌లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్లో 61,928, ఎంటీఎన్‌ఎల్‌లో 34,997, ఎస్‌ఈసీఎల్‌లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయని వివరించారు.
అభివృద్ధి చెందితే ఉద్యోగాలు ఎందుకు తగ్గాయి..
దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెబుతున్న పాలకులు ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయో చెప్పాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం… ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్‌కాల్ అంటే ప్రభుత్వాన్ని ఇదేనా అని నిలదీశారు.
ఏడు దశాబ్దాలలో ఎప్పుడూ ఇలా లేదు..
స్వతంత్య్ర భారత దేశంలో గత ఏడు దశాబ్దాలలో ఎప్పుడూ ఇలాటి పరిస్థితి చూడలేదని పేర్కొన్నారు. క్రోనీ క్యాపిటలిజం, పెరుగుతున్న నిరుద్యోగం 2024 లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అస్త్రాలు అవుతాయని తెలిపారు.