
Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేరు. కనీసం మీడియాలో కూడా కనిపించడం లేదు. ప్రస్తుతానికి భౌతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అక్కడ కూడా కనిపిస్తోంది తక్కువే. అయితే ఆయన కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీలోకి తెచ్చి కీలక పదవి అప్పగించనున్నట్టు పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. దివంగత వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా వ్యవహరించారు. మంత్రి పదవిని ఆశించినా వైఎస్ మాత్రం స్పీకర్ పదవి కట్టబెట్టి కిరణ్ కుమార్ రెడ్డి వాయిస్ ను నొక్కేశారన్న అపవాదు ఉంది.
2010లో రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత కేబినెట్ లో సీనియర్ అయిన రోశయ్యకు సీఎం పదవి వరించింది. అయితే అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో రోశయ్య ఆశించినంతగా పనిచేయలేదు. దీంతో హైకమాండ్ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పీఠం ఎక్కించింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. కుటుంబ రాజకీయ నేపథ్యంతో సీఎం పదవి వరించింది. అందుకు తగ్గట్టుగానే కిరణ్ పాలనా పరంగా మంచి మార్కులే సాధించారు. అయితే ఇంతలో జగన్ వైసీపీ రూపంలో, రాష్ట్ర విభజన మరో రూపంలో కిరణ్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కాంగ్రెస్ ను వీడి సమైఖ్యాంధ్ర పార్టీని పెట్టినా పెద్దగా సక్సెస్ కాలేదు. చివరకు పీలేరులో తన సొంత సోదరుడిని నిలబెట్టినా ఓటమి తప్పలేదు.
2014 ఎన్నికల తరువా కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషిచేస్తూ వస్తున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతంలో భాగంగా కిరణ్ ను కాంగ్రెస్ పార్టీలో సాదరంగా ఆహ్వానించింది. ప్రస్తుతం కిరణ్ అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ మాజీ సీఎం హోదాలో కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే మైలేజ్ వస్తుందని బీజేపీ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇచ్చే ప్రాధాన్యత బట్టే ఆ పార్టీలో చేరాలా? వద్దా? అని డిసైడ్ కానున్నట్టు కిరణ్ అనుచరులు చెబుతున్నారు.

కొద్దిరోజుల కిందట కిరణ్ కుమార్ బీజేపీలో చేరుతారన్న టాక్ వినిపించింది. అప్పట్లోకిరణ్ ఖండించారు. అయితే ఇటీవల బీజేపీ పెద్ద నేతలు కిరణ్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి కావడంతో రెండు రాష్ట్రాల్లో ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీలో ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కిరణ్ కు జాతీయ స్థాయిలో పార్టీ పదవితో పాటు రాజ్యసభ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీలో చేరుతున్నందున.. తన గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని కిరణ్ కోరినట్టు సమాచారం. అయితే అన్నీ కుదిరితే మాత్రం కొద్దిరోజుల్లో కిరణ్ బీజేపీ గూటికి చేరడం ఖాయంగా తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాలతో పాటు చంద్రబాబు రాజకీయాలు చేశారు. ఈ మూడు కుటుంబాల మధ్య వైరం ఉంది. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సైతం ఒకే పార్టీలో ఉన్న నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య అంతగా పొసిగేది కాదు. ఆ కారణం చేతనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ గూటికి చేరారు. అప్పటికే సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని అచేతనంగా చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి పవర్ లో ఉండడంతో చిత్తూరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. అటు జగన్, పెద్దిరెడ్డిలను ఎలాగూ వ్యతిరేకిస్తున్నారు. తమ్ముడు కిషోర్ టీడీపీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్స్ కు కిరణ్ గట్టి ప్రయత్నమే చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.