Chandrababu Arrested: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు అయ్యారు. ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాది గట్టిగా వాదనలు వినిపించడంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబును పంపించారు.. ఇదీ మొన్నటి నుంచి నిన్నటి రాత్రి వరకు జరిగిన హై డ్రామా. సరే దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడికి సరైన శాస్తి జరిగిందని వైసీపీ నాయకులు అంటుంటే.. ఇది సరైన విధానం కాదని టిడిపి నాయకులు అంటున్నారు. సరే అవి రాజకీయ పార్టీలు కాబట్టి.. పొలిటికల్ ఫాయిదా ఆధారంగానే నాయకుల మాటలు ఉంటాయి..
కానీ జగన్ మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో కసి పెంచుకునే విధంగా చేసింది ఎవరు? మార్గదర్శిని గెలికి, చంద్రబాబు ఆర్థిక మూల స్తంభాలను పెకిలించే పనికి ఉసిగొలిపింది ఎవరు? ఈ అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం చంద్రబాబు నాయుడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. పరిటాల రవీంద్ర హత్య తర్వాత నిండు శాసనసభలో.. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడారు. పరిటాల రవీంద్రను హత్య చేసింది ముమ్మాటికీ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించాడు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంటనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించాడు. సీన్ కట్ చేస్తే సిబిఐ ఎంక్వయిరీ చేసింది. జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు. అప్పటిదాకా అతడు బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు అప్పుడు అతడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. మీడియా అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఆసక్తి చూపింది. కొన్ని కొన్ని న్యూస్ చానల్స్ ఆ పని కూడా చేశాయి. ఎప్పుడైతే తనపై నింద పడిందో.. అప్పుడే చంద్రబాబు మీద జగన్ కసి పెంచుకున్నాడు.
వెంటనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. మొదట్లో వద్దని చెప్పినప్పటికీ.. ఒత్తిడి తీసుకురావడంతో రాజశేఖర్ రెడ్డి కడప స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డికి పార్లమెంటు సభ్యుడిగా అవకాశం కల్పించాలి అనుకున్నాడు. అయితే ఆ స్థానంలో అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి పార్లమెంటు సభ్యుడుగా కొనసాగుతున్నాడు. అప్పుడు ఆయనను పిలిపించి.. విషయం మొత్తం చెబితే వివేకానంద రెడ్డి ఒప్పుకున్నాడు. సీన్ కట్ చేస్తే కడప ఎంపీ స్థానం నుంచి జగన్ పోటీ చేసి గెలుపొందాడు. అప్పుడు జగన్ పార్లమెంటు సభ్యుడు కావడం సోనియాగాంధీకి ఇష్టం లేదు.. ఇలా చేయడం ఏంటని కూడా వైయస్ కుటుంబ సభ్యులను మందలించారు. ఇది కూడా జగన్లో కాంగ్రెస్ అంటే ఒక రకమైన కసిని పెంచింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర్ రెడ్డి చనిపోవడం.. జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం.. ఉప ఎన్నికల్లో ఆయనకు పోటీగా వైఎస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దించడం.. జగన్మోహన్ రెడ్డి రికార్డ్ స్థాయిలో విజయం సాధించడం.. సొంత పార్టీని ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి జగన్ 16 నెలలపాటు జైలుకు వెళ్లడం.. ఈ కేసులో చంద్రబాబు ఇంప్లీడ్ అవ్వడం కూడా జగన్లో మరింత కోపాన్ని పెంచింది. ఆ కోపమే, ఆ కసే చంద్రబాబుపై ప్రతి కాలాన్ని తీర్చుకునే దిశగా అడుగులు వేయించింది. ఇప్పుడు జగన్ చేస్తుంది రైటా ? రాంగా? అనేది పక్కన పెడితే.. రాజకీయాల్లో వ్యక్తిగత వైరాలు అనేవి మంచివి కావు. అధికారం ఉండొచ్చు, రేపు వేరే వారి చేతిలోకి వెళ్లొచ్చు. అంతిమంగా ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యానికి ప్రజలే ప్రభువులు కాబట్టి.. నియంత విధానాలు ఎప్పటికీ మంచివి కావు.