Y S Jagan Fish Mart: గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలంటారు. ఇందులో ఒకరి పనిలో మరొకరు కలగుజేసుకున్నా అబాసుపాలవ్వక తప్పదు. ఏపీ సర్కారు కూడా ఇలాంటి పనులే చేసి అబాసుపాలవుతోంది. ప్రజల వద్ద చులకన అవుతోంది. పాలనను గాలికొదిలేసి మాంసం, చేపలు అమ్ముతాం. అటు ప్రజారోగ్యంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడతామంటూ కాకమ్మ కబుర్లు చెప్పి ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెట్టారు. హంగూ ఆర్భాటంతో ప్రారంభించారు. నెల తిరక్కుండానే మూసివేశారు. ఇదేం చోద్యమంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజలకు మటన్ సరిగ్గా దొరకడం లేదని.. ఫ్రెష్ చేపలు దొరక అనారోగ్యం బారినపడుతున్నారని తెగ బాధపడిపోయిన జగన్ సర్కారు ‘మటన్, ఫిష్ ఆంధ్రా స్టాల్స్’ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం మటన్, చేపలు అమ్మడమేమిటని విపక్షాలు ప్రశ్నించిన వెనక్కి తగ్గలేదు. మేధావులు తప్పుపట్టినా పట్టించుకోలేదు.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ‘ఫిష్ ఆంధ్రా స్టాల్’ను ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. ప్రైవేటు వ్యక్తులకు రాయితీలను కల్పించి మరీ ప్రారంభింపజేశారు. లక్షలాది రూపాయల అత్యాధునిక పరికరాలను సైతం తెప్పించారు. ఇదో అద్భుత కార్యక్రమంగా సీఎం జగన్ అభివర్ణించేవారు. తన నియోజకవర్గంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఏర్పాటుచేయడంపై తెగ సంబరపడిపోయారు. అయితే నెల రోజులకే స్టాల్ మూతపడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ చేపలు, మాంసం కొనేవారు లేక నిర్వాహకులు ఈగలు తోముకునేవారు. రోజుకు కనీస స్థాయిలో అమ్మకాలు జరగలేదు సరికదా.. నెల తిరిగే సరికి సుమారు లక్షన్నర రూపాయల వరకూ కరెంట్ బిల్లు వచ్చింది. అందులో సగం అమ్మకాలు లేకపోవడంతో నిర్వాహకులు ఖంగుతిన్నారు. స్టాల్ ను మూసేశారు. దీనికి యంత్రాలు చెడిపోయయన్న కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. నెల కిందట జర్మనీ నుంచి తెచ్చిన యంత్రాలు అప్పుడే చెడిపోతాయా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును విపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. గొప్పగా ఫీలవుతూ వచ్చిన సీఎం జగన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి మటన్, చికెన్ స్టాల్స్ ఏర్పాటు అనాలోచిత నిర్ణయంగా మేథావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో చేపలు, మాంసం విక్రయ కేంద్రాలున్నాయి. ప్రజలు కూడా వాటికి అలవాటు పడిపోయారు. దిన చర్యలో భాగంగా నేరుగా అక్కడికి వెళ్లి మాంసం, చేపలు కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఉన్న మార్కెట్లకే ప్రోత్సాహమందించి ఉంటే సరిపోయేది. కానీ మన జగన్ సర్కారు అంతా వింతగా ఆలోచిస్తుంది కదా. నలుగురుకి నచ్చినది తనకు నచ్చనట్టు, ప్రజల కోసం విభిన్నంగా ఆలోచిస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ విదేశాల తరహాలో ‘మటన్, ఫిష్ ఆంధ్రా స్టాల్స్’కు రూపకల్పన చేసింది. కోట్లాది రూపాయలతో మహత్ కార్యక్రమాన్ని ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రారంభించి చేతులు కాల్చుకుంది. ఇన్నాళ్లూ అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా గొప్పగా చెప్పకున్న జగన్ కోపానికి గురికావాల్సి వస్తుందని అధికారులు కొత్త పల్లవిని అందుకున్నారు. మిషనరీ డ్యామేజ్ అంటూ భారీగా ప్రకటనలు చేస్తున్నారు. ఒక సీఎం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అసలు ఈ స్టాల్స్ కు ఆలోచన చేసే సమయంలో ఇది సాధ్యమేనా? అన్న ప్రశ్న అధికారులకు ఉత్పన్నం కాలేదా? ఎదురుచెబితే సీఎం కోపానికి గురికావాల్సి వస్తుందా అన్న భయమా? అన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నేలవిడిచి సాము చేసే ప్రయత్నాలు మానుకోకుంటే ‘మటన్, ఫిష్ ఆంధ్రా స్టాల్స్’వంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రజల్లో మరింత చులకన అవ్వక తప్పదు.