Lok Sabha Election 2024: మనదేశంలో ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. 21 రాష్ట్రాల్లో 102 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించి.. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే తొలి దశలో 102 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కొన్ని సెగ్మెంట్లలో జరిగే పోరు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.. ఎందుకంటే..
కోయంబత్తూరు, తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బిజెపి ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా దక్కించుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ రాష్ట్రంలో ఖాతా తెరవాలని బిజెపి భావిస్తోంది. ఈ స్థానం నుంచి బిజెపి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పోటీలో ఉన్నారు. ఆయన పోటీ నేపథ్యంలో గెలుపుపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి.
నాగ్ పూర్, మహారాష్ట్ర
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నారింజ పండ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. పైగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఈ స్థానంలో గెలవాలని నితిన్ గడ్కరి బలంగా ప్రచారం చేస్తున్నారు..
మణిపూర్
ఈ రాష్ట్రంలో రెండు స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 19న మొదటి దశలో ఒక నియోజకవర్గం, ఏప్రిల్ 26న రెండవ దశలో మరొక నియోజకవర్గంలో ఓటింగ్ నిర్వహిస్తారు. మణిపూర్ ప్రాంతంలో ఇటీవల గొడవలు జరిగిన నేపథ్యంలో.. 200 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్
2013లో ఇక్కడ భారీగా అల్లర్లు జరిగాయి. 2014లో బిజెపి 72 స్థానాలు గెలుపొందడంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు భారీగా ఉన్నప్పటికీ.. 2014, 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి భావిస్తోంది.
ఇక మొదటి దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలలో.. తమిళనాడు డీఎంకే పరిపాలనలో ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, అస్సాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో బిజెపి అధికారంలో ఉంది. నాగాలాండ్, సిక్కిం, పుదుచ్చేరి ప్రాంతాలలో బిజెపి పొత్తుల ద్వారా అధికారంలో ఉంది. అండమాన్, నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిజోరాం రాష్ట్రాన్ని జోరాం పీపుల్స్ మూమెంట్ పరిపాలిస్తోంది.
ఇక తొలి దశలో జరిగే 102 స్థానాలలో 45 స్థానాల్లో సెట్టింగ్ ఎంపీలుగా ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. మిగతా స్థానాలలో 42 మాత్రమే బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే సత్తా చాటింది. 23 పార్లమెంట్ స్థానాలను డిఎంకె, 8 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక అస్సాం రాష్ట్రంలో కలియబోర్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇదే రాష్ట్రంలో తేజ్పూర్ స్థానంలో బిజెపి గెలిచింది. అయితే ఆ స్థానంలో ఏప్రిల్ 26న అంటే, రెండవ దశలో పోలింగ్ జరగనుంది.