Droupadi Murmu- KCR And Tamilisai: కొన్ని బంధాలు ఎలా చిక్కబడతాయో… అలానే దూరమవుతాయి.. తెలంగాణకు గవర్నర్ గా తమిళ సై నియమితులైనప్పుడు రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు పెద్దగా దూరం ఉండేది కాదు. పైగా తన చెల్లె అంటూ కేసీఆర్ నుంచి గౌరవం కూడా దక్కింది. ప్రగతి భవన్ నుంచి సారె కూడా వెళ్ళింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ అన్నా చెల్లి అనుబంధం పలుచబడింది. సారె పంపిన స్థానంలో కత్తులు దుయ్యడం ప్రారంభమైంది. మొత్తానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చింది.

కలిసినట్టేనా?
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నిన్న హైదరాబాద్ వచ్చారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆమె ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయింది.. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలకడం ఆనవాయితీ.. అయితే కెసిఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాడు అనుకున్నారు.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన, తన మంత్రివర్గం, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది.. మీడియాకు కావాల్సినంత స్టఫ్ దొరికింది.

ఇద్దరు కలిసిపోయారా
చంద్రశేఖర రావు, తమిళ సై సౌందర్ రాజన్ ఇటీవల పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు.. ముఖ్యంగా గవర్నర్ అయితే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. తన తల్లి చనిపోయినా కనీసం విమానం ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు.. భద్రాచలం, మహబూబ్ నగర్, మేడారం ఇతర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రగతి భవన్, రాజ్ భవన్ కు దూరం చాలా పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఆమెకు స్వాగతం పలికారు. అంతేకాదు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అయితే ఇద్దరూ పాత గొడవలకు స్వస్తి పలికి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ముఖ్యమంత్రి ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మాదిరి ట్విస్ట్ ఇచ్చాడు.. రాష్ట్రపతికి స్వాగతం పలికి తన మానాన తాను ప్రగతి భవన్ వెళ్ళిపోయాడు. విందుకు గైర్హాజరయ్యాడు. తాను పైకి చిందించిన నవ్వులు ఒరిజినల్ కాదని… లోపల పగ అలానే ఉందని తన చేష్టల ద్వారా చూపించాడు. ఈ ఫోటో చూసిన వారికి ఇద్దరు కలిసిపోయారు అనే భావన కలిగింది. కానీ బయట నవ్వులు…లోపల కత్తులు. అంతే… అంతకుమించి ఏమీ లేదు.. ఇప్పట్లో రాజ్ భవన్, ప్రగతి భవన్ కు దూరం తగ్గదు.