Minister Buggana: ఒకటో తారీఖు వచ్చిందంటే చాలూ ఏపీ ప్రభుత్వం వణికిపోతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం ఎలా అని మార్గాలు వెతకాల్సి వస్తోంది. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలకు శ్రుతిమించి ఖర్చు చేయడంతో రాష్ట్రం అప్పులబారిన పడక తప్పడం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వం వద్ద పలుచన అవుతోంది. ప్రతీ నెలా మూడో వారమే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి క్యూకడుతున్నారు. కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం వెంపర్లాడుతున్నారు. గత మూడేళ్లుగా ఇదో పరిపాటిగా మారిపోయింది. అప్పులిచ్చేందుకు బ్యాంకులు సైతం ముఖం చాటేస్తున్నాయి.
చివరకు కార్పొరేషన్ల ద్వారా రుణం పొందుతామన్నా ఆ పనీ అయిపోయింది. చివరకు లిక్కర్ ద్వారా రుణం సమకూర్చుకోవాల్సిన స్థితికి ప్రభుత్వం చేరుకుంది. తాజాగా మే నెల కష్టాల నుంచి గట్టెక్కేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కొత్త అప్పుల అనుమతి కోసం గత వారం రోజులుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పడరాని పాట్లు పడుతున్నారు. రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినా నిరాశే ఎదురైంది. శనివారం నాటికి కూడా కేంద్ర ఆర్థిక శాఖ కనికరించలేదు. దీంతో విసిగి వేశారిపోయిన రావత్ తిరిగి రాష్ట్రానికి విచ్చేశారు. కొత్త అప్పులకు అనుమతిచ్చేందుకు వీలుగా కేంద్రం అడిగిన వివరాలన్నీ ఆర్థికశాఖ అధికారులకు బుగ్గన, రావత్ సమర్పించినట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో కొంత అప్పునకు కేంద్రం నుంచి అనుమతి వస్తే మంగళవారం ఆర్‌బీఐ వద్ద జరిగే రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొనాలని ఏపీ భావిస్తోంది. సాధారణంగా ఈ వేలంలో పాల్గొనేందుకు వీలుగా శుక్రవారమే ఆర్‌బీఐకి రాష్ట్రాలు ఇండెంట్లు పెడతాయి. ఏపీకి ఇంకా కొత్త అప్పులకు అనుమతివ్వక పోవడంతో ఇండెంట్ పెట్టలేదని తెలుస్తోంది.
Also Read: KTR: మోడీ గాడ్సే భక్తుడు.. దమ్ముంటే అరెస్టు చేయండి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రూ.80 వేల కోట్లు అవసరం
ఈ ఏడాది జగన్ సర్కారు కేంద్రాన్ని ఏకంగా రూ.80వేల కోట్ల అప్పు అడిగింది. ఈ అప్పులు వస్తాయనే ఆశతోనే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని జూన్‌లో ఇస్తామని ప్రకటించారు.. ఈ పథకానికి రూ.6,500కోట్లు అవసరం. జూన్ లో అమ్మఒడి ఇవ్వకుంటే ప్రజల్లో పలుచన అవుతామని సీఎం జగన్ ఆందోళన చెందుతున్నారు. తల తాకట్టు పెట్టయినా అమ్మఒడి అందించాలన్న క్రుతనిశ్చయంతో ఉన్నారు. అప్పులకు కేంద్ర అనుమతి నిరాకరిస్తే రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని భావిస్తు న్నట్టు సమాచారం. కానీ, ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులిచ్చేందుకు ఎస్‌బీఐ సహా అన్ని బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. ఒక్క బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే అప్పులిచ్చేందుకు ఉత్సాహం చూపుతోంది.
జగన్ సర్కారు దాస్తున్న అప్పుల లెక్కలన్నీ కేంద్రం గుర్తిస్తే మరో మూడేళ్లు కొత్త అప్పులకు అనుమతిచ్చే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రంతో ఏదైనా పంచాయితీ వస్తే కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకునే కసరత్తును కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. అందుకే బీజేపీ విషయంలో జగన్ కిమ్మనకుండా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో ఏమాత్రం తేడా కొట్టినా ఆర్థిక సహకారం కొరవడుతుందని.. అప్పుడు పథకాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీబీఐ కేసులు తిరగదోడితే అసలుకే మోసం వస్తుందని జగన్ ఆందోళనకు గురవుతున్నారు. అందుకే పథకాల అప్పుల విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెడుతున్న సహనంతో ఉండడానికి అవే కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:IPL 2022: నాడు ధోని.. నేడు పంత్ అచ్చం అలానే చేశారు.. కానీ..!
Recommended Videos