Chandrababu- 2024 Elections: మహానాడు సక్సెస్ తో జోష్ మీద ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సంవత్సరాలు ప్రజల మధ్యే ఉండాలని నిర్ణయించుకున్నారు. అన్ని జిల్లాలను చుట్టేయనున్నారు. మరోవైపు కుమారుడు లోకేష్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబు, అటు లోకేష్ కార్యక్రమాలు సమాంతరంగా ఉండేలా చూస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. అంతకు ముందే చంద్రబాబు జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ నెల 15వ తేదీన అనకాపల్లి జిల్లా నుంచి ఆయన తొలి అడుగు పడనుంది. క్షేత్ర స్థాయిలోకి మరింత విస్తృతంగా వెళ్లి పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం, ప్రజలతో మమేకం కావడం కోసం ఆయన ఈ సుదీర్ఘ పర్యటనను పెట్టుకొన్నారు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాది వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రతి జిల్లాలో ఆయన మూడేసి రోజులు ఉంటారు. మొదటి రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ జిల్లా మహానాడు కార్యక్రమం ఉంటుంది. రెండోరోజు ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అవుతారు.మూడోరోజు ఆ జిల్లాలో లేక సమీప జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షేత్ర స్ధాయి ప్రజా సమస్యల పరిశీలన జరుగుతుంది. ఆ సందర్భంగా ఆ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు.
80 నియోజకవర్గాల్లో…
సరాసరిన ఒక్కో పర్యటనలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించడం ద్వారా ఈ ఏడాదిలో మొత్తం ఎనభైకి పైగా నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ఏడాది పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇదే ఏడాది పార్టీ నలభై వసంతాల వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రెంటినీ పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో మహానాడు సమావేశాలు నిర్వహించాలని నిశ్చయించారు. మామూలుగా అయితే మహానాడు సమావేశాలు కేవలం మే నెలలోనే జరగడం టీడీపీలో ఆనవాయితీ. కానీ శత జయంతి కార్యక్రమాల సందర్భంగా ప్రతి జిల్లాలో మహానాడు సమావేశాలు పెడుతున్నారు.
Also Read: Chandrababu Internal Survey: టీడీపీ నేతలకు సర్వే గుబులు..నేతల పనితీరుపై చంద్రబాబు ఫొకస్
ప్రభుత్వ వైఫల్యాలపైనే..
ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ఈ సమావేశాల్లో చర్చలుంటాయి. ఈ పర్యటనల మధ్యలో ఆయన ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వివిధ పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రణాళికల తయారీ వంటివి నడిపిస్తుంటారు. బుధవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో సమావేశం అయిన ఆయన… ఈ ప్రణాళికను ఖరారు చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఖరారు..
చంద్రబాబు ఈ నెల 15వ తేదీన చోడవరంలో అనకాపల్లి జిల్లా మహానాడు సమావేశంలో పాల్గొంటారు. 16వ తేదీన అనకాపల్లిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఉంటాయి. 17వ తేదీన విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి సమస్యల పరిశీలన, రోడ్‌షోలు ఉంటాయి. తోటపల్లి రిజర్వాయర్ చివరి భూముల సమస్యను ఆయన ఈ పర్యటనలో పరిశీలించనున్నారు.
Also Read: Pawan Kalyan Tweets: జనసేన సైనికులారా జరభద్రం… పవన్ ట్విట్ల వెనుక కథ ఇదా?