Bihar: పోషకాలకు నెలవు అయిన అరటిపండు.. ఒక్కో రాష్ట్రంలో రకరకాల విధాలుగా లభిస్తుంది. ఉదాహరణకు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే అరటి పండుతుంది. అది సాధారణ హైబ్రిడ్ రకానికి చెందింది. ఆంధ్రలో అయితే చక్కర కేలి, అమృతపాణి రకాలకు చెందిన అరటి పండ్లు లభిస్తాయి. బెంగాల్లో ఒక తీరుగా, తమిళనాడులో మరో తీరుగా, కేరళలో ఇంకొక తీరుగా అరటి పండ్లు లభ్యమవుతాయి. అయితే బీహార్ లో మాత్రం ఒక అరటిపండు ఏకంగా రైలునే ఆపేసింది. అదేంటి చేతిలో ఇమిడి పోయే పరిమాణంలో ఉన్న అరటిపండు అంత పెద్ద రైలులో ఆపేయడం ఏంటి అనే సందేహం మీలో కలిగింది కదా.. మీకు మాత్రమే కాదు, ఈ కథనం రాస్తున్న మాకు కూడా కలిగింది.. అయితే దాని లోతుల్లోకి వెళితే.. అబ్బో అరటి పండుకు కూడా ఇంతటి సన్నివేశం ఉందా అనిపించింది. పెద్ద ఓడని సైతం చిన్నచిల్లు ముంచుతుంది అనే సామెత గుర్తొచ్చి.. అరటిపండు మాత్రం ఏం తక్కువ అని అనిపించింది.
రైలును ఆపేసింది
బీహార్ రాష్ట్రంలో సమస్తిపూర్ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు స్టేషన్లో కిష్కింధకాండ చేస్తుంటాయి. వచ్చే ప్రయాణికుల సామగ్రిని లాగేసుకుంటూ నానా బీభత్సం సృష్టిస్తాయి. అందువల్లే ఈ స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు ఒంటరిగా రారు. అయితే ఈ స్టేషన్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సమస్తిపూర్ రైల్వే స్టేషన్లోని నాలుగో ప్లాట్ఫారంలో కోతులకు ఒక అరటిపండు దొరికింది. అరటి పండు కోసం రెండు కోతులు కొట్లాడుకున్నాయి. ఒక కోతి అరటిపండు పట్టుకుని వెళుతుండగా.. కోపం వచ్చిన మరో కోతి మీదకు ఒక రబ్బర్ వస్తువును విసిరేసింది. ఆ రబ్బర్ వస్తువు విద్యుత్ వైరు కు తగిలింది. వెంటనే విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో ఆ స్టేషన్ కు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.. దాదాపు గంటసేపు రైళ్ళు రాకపోకలు కొనసాగించలేదు.. దీంతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. సమస్య ఎక్కడుందో కనుక్కోవడం.. ఆ తర్వాత పరిష్కరించడం.. ఇవన్నీ జరిగే సరికి చాలా సమయం పట్టింది. కోతులు చేసిన పని వల్ల రైల్వే శాఖకు చాలా నష్టం వాటిల్లింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సుమారు 20 మంది సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంతటి సంచలనానికి కారణమైన కోతులు మాత్రం అరటిపండును చెరి సగం పంచుకొని దర్జాగా వెళ్లిపోయాయి. ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తోంది.