Queen Elizabeth Passed Away: ఆమె రాజు బిడ్డ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో పుట్టిన బిడ్డ. అడుగడుగునా మంది మాగాదులు ఉండే రాజ ప్రసాదం, చిటిక వేస్తే కోరినవన్నీ కళ్ళ ముందు ఉండే అధికారం ఆమె కుటుంబీకుల సొంతం. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆమె 13 ఏళ్లకే ప్రేమలో పడింది. ఆ రోజుల్లోనే తన ప్రియుడికి ఉత్తరాలు రాసి పోస్టుల్లో పంపేది. దీనిపై ఎవరు ఏమనుకున్నా లెక్కచేసేది కాదు. 13 ఏళ్లకే అంత టెంపరితనమా అని అనుకోకండి. ఎందుకంటే ఆమె క్వీన్ ఎలిజబెత్. పుట్టింది బ్రిటన్ లో. కామన్వెల్త్ దేశాలకు రాణిగా, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ధీరవనితగా వినతికెక్కిన ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గురువారం స్కాట్ లాండ్ లో కన్నుమూశారు.

ఆమె తీరే అంత
క్వీన్ ఎలిజిబెత్_2 1926 ఏప్రిల్ 21న మే ఫెయిర్ లో డ్యూక్ ఆఫ్ యార్క్( కాబోయే రాజు) అల్బర్ట్ ( రాజు అయ్యాక జార్జ్_ 4), డచెస్ ఆఫ్ యార్క్( కాబోయే రాణి) లియాన్( రాణి అయ్యాక ఎలిజబెత్) లకు జన్మించారు. పుట్టిన పదేళ్లకు అంటే 1936లో ఆమె తల్లిదండ్రులు అనూహ్య పరిస్థితుల మధ్య బ్రిటన్ రాజు, రాణి గా బాధ్యతలు చేపట్టారు. ఎలిజిబెత్- 2, ఆమె సోదరి మార్గరెట్ విద్యాభ్యాసమంతా బకింగ్ హమ్ ప్యాలస్ లో జరిగింది. ఆమెకు చరిత్ర, ఆంగ్లం, ఆంగ్ల భాషా సాహిత్యం, సంగీతంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. మొదటినుంచి ఎలిజబెత్ కు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిననే గర్వం ఉండేది కాదు. ఆమెకు గుర్రాలన్నా, కుక్క పిల్లలన్నా చాలా ఇష్టం. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి అప్పటికే ఆమె బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన కొన్ని బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎలిజబెత్ _2 కు 25 ఏళ్ల వయసు వచ్చాక ఆమె తండ్రి కింగ్ జార్జ్ కన్నుమూశారు. దీంతో ఎలిజబెత్-2 రాణిగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత దీనిని నిరాకరించారు. అయితే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడు కామన్వెల్త్ స్వతంత్ర దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంకకు ఆమె రాణిగా ఉండేవారు. అయితే అప్పటికే భారతదేశ ప్రభుత్వం తనను తాను గణతంత్ర రాజ్యం గా ప్రకటించుకుంది.
సమస్యల పరిష్కారంలో దిట్ట
తండ్రి మరణం తర్వాత రాణిగా బాధ్యతలు చేపట్టిన ఎలిజబెత్_2 పాలనలో ఎంత లౌక్యాన్ని ప్రదర్శించేవారు. ఉత్తర ఐర్లాండ్ సంక్షోభాన్ని, ఆస్ట్రేలియాలో రాజకీయ సంక్షోభాన్ని ఆమె సమర్థవంతంగా పరిష్కరించారు. అంతేకాకుండా రిటన్ తీసుకునే పలు నిర్ణయాలలో ఆమె చొరవ ఉండేది. బ్రిటిష్ దేశంపై ఉన్న అపప్రదను తొలగించేందుకు సుమారు 20 పైగా దేశాలకు ఆమె స్వాతంత్ర్యం ప్రకటించారు. 1986లో చైనా, 1994లో రష్యా, 2011లో ఐర్లాండ్ దేశాల్లో ఆమె చేసిన పర్యటనలు చారిత్రాత్మకంగా నిలిచిపోయాయి. 1972లో యుగోస్లేవియాలో పర్యటించి, ఓ కమ్యూనిస్టు దేశాన్ని సందర్శించిన బ్రిటన్ రాణిగా వినతికెక్కారు. 1974లో బ్రిటిష్ పార్లమెంట్లో సంక్షోభం తలెత్తినప్పుడు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హంగు పార్లమెంట్ ఏర్పడింది. దీంతో ఆమె విపక్ష నేతను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరి సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. 1977, 2002, 2012, 2022 సంవత్సరాలలో ఆమె తను రాణిగా బాధ్యతలు చేపట్టడానికి గుర్తుగా రజత, స్వర్ణ, వజ్ర ఉత్సవాలు, ప్లాటినం జూబ్లీ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
అసలు ఆమె పెళ్ళే ఒక చరిత్ర
13 ఏళ్లకే ప్రేమలో పడిన ఎలిజబెత్_2 ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1947 నవంబర్లో ఆమె గ్రీస్, డెన్మార్కుల మాజీ రాకుమారుడు పిలిప్ మౌంట్ బాటన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫిలిప్ ను ఆమె మొదటిసారి 1934లో కలిశారు. 1939లో అతనిని కలిసినప్పుడు ఎలిజబెత్ కు 13 ఏళ్లు. అప్పట్లో ఆమె ధైర్యంగా పిలిప్ ను ప్రేమిస్తున్నాను అని చెప్పేశారు. వీరిద్దరూ పోస్ట్ ద్వారా ప్రేమ లేఖలు పంపుకునేవారు. అప్పట్లో వారి ప్రేమపై సర్వత్రా విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. పిలిప్ బ్రిటిషర్ కాకపోవడం, ఆయనకు రాకుమారిని పెళ్లాడే స్థాయి లేకపోవడం, అతడు చెల్లి నాజీలతో సత్సంబంధాలు ఉన్న ఒక రష్యన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వంటి కారణాలు ఆమె ప్రేమ పెళ్లికి అడ్డుపడ్డాయి. అయినప్పటికీ వాటిని ఆమె లెక్క పెట్టలేదు. ఆ రోజుల్లోనే ధైర్యంగా పిలిప్ ను పెళ్లి చేసుకుంది. ఇక ఎలిజబెత్, పిలిప్ నకు చార్లెస్, రాయల్ అన్నే, ప్రిన్స్ అండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. ఎలిజిబెత్ రాణిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిలిప్ కొద్దిరోజులు ఇబ్బంది పడ్డాడు. వార్తా పత్రికలు కూడా పిలిప్ కు అంత ప్రాధాన్యం ఇచ్చేవి కాదు. ” ఈ దేశంలో తన పిల్లలకు తండ్రి పేరు పెట్టుకోలేని ఏకైక వ్యక్తిని నేనే కావచ్చు” అని పలుమార్లు ఫిలిప్ బాహటంగానే విమర్శించేవాడు. అయితే 1960లో ఫిలిప్, ఎలిజబెత్ దంపతులు మౌంట్ బాటమ్ అనే పిల్లాడిని దత్తత తీసుకున్నారు. అతడికి పిలిప్ ఇంటి పేరును పెట్టుకున్నారు. పిలీప్ కుమారుడు అయినప్పటికీ మౌంట్ బాటన్ కు ఎటువంటి రాజరిక హోదా ఉండదు.

అయితే గత ఏడాది ఏప్రిల్ లో ఫిలిప్ కన్నుమూశారు. ఆయనకు కన్నుమూసిన ఏడాది తర్వాత ఎలిజిబెత్ కూడా తుది శ్వాస విడిచారు. బ్రిటన్ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన రాణిగా ఎలిజబెత్_2 2015లో రికార్డు సాధించారు. అంతకుముందు ఈ రికార్డు క్వీన్ విక్టోరియా పేరిట ఉండేది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక కాలం పాలించిన రెండో వ్యక్తిగా క్వీన్ ఎలిజబెత్_2 రికార్డులకు ఎక్కారు. 1643 నుంచి 1715 వరకు అంటే 72 ఏళ్ల పాటు లూయిస్_15 ఫ్రాన్స్ ని పాలించారు. ఆయన మొత్తం 26, 407 రోజులపాటు పాలన సాగించగా, క్వీన్ ఎలిజబెత్_2 పాలన 25, 782 రోజులు సాగింది. మహిళా పాలకుల విషయంలో ఎలిజిబెత్ _2 సుదీర్ఘకాలం పాలించిన నాయకురాలు. అయితే ఎలిజిబెత్_2 పలు మార్లు మీడియా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె పిల్లల విడాకుల సమయంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ గా ఉన్న డయానా మరణం సమయంలో వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడంపై మీడియా విమర్శలు చేసింది. ఇక 2020 మార్చి 19న కోవిడ్ కేసుల పెరుగుదల నమోదవడంతో క్వీన్ ఎలిజిబెత్_2 విండ్ సర్ క్యాసల్ కు మకాం మార్చారు. అప్పటి నుంచి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. కేవలం టీవీల ద్వారానే ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో ధైర్యం నూరిపోశారు. ఎలిజిబెత్_2 భారతదేశానికి మూడుసార్లు వచ్చారు. 1961 లో భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె భర్త ఫిలిప్ స్లిప్పర్లు తొడుక్కుని రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధికి నివాళులర్పించారు. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది. తర్వాత 1983లో, 1997లో భారతదేశానికి వచ్చారు. కాగా ఆమె మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. తన పాలనలో 15 మంది బ్రిటన్ ప్రధానులను చూసి ఎలిజిబెత్_2 రికార్డు సాధించారు. అయితే ఈమె మరణం తర్వాత బ్రిటన్ తదుపరి రాజుగా ఎలిజబెత్_2 పెద్ద కుమారుడు చార్లెస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read:India vs Pakistan Asia Cup Match Effect: పాకిస్తాన్ తో ఓటమి ఎంత పని చేసింది
[…] […]