Amaravati JAC Padayatra: అమరావతి రైతులకు పోలీసులు షాకిచ్చారు. వారు తలపెట్టిన మహా పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సంగతి తెసిందే. దీంతో అమరావతి రైతులు నిరసన బాట పట్టారు. వారి ఆందోళన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్రకు రైతులు నిర్ణయించారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఆన్ లైన్ లో పాదయాత్రలో పాల్లొనే వారి వివరాలను నమోదుచేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతా సిద్ధమవుతున్నతరుణంలో గురువారం రాత్రి అనుమతి నిరాకరిస్తూ… అందుకు గల కారణాలను పేర్కొంటూ పోలీస్ శాఖ జేఏపీ నేతలకు నోటీసులిచ్చింది, కొద్దినెలలుగా అమరావతి రైతులు మహా పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. అటు వేలాది మంది స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ మహా పాదయాత్రలో పాల్లొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే అమరావతి రైతులు గతంలో చేపట్టిన అమరావతి టూ తిరుపతి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కూడా ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తే ప్రభుత్వానికి చెంపపెట్టులా మారుతుందని భావించి అడ్డుకుంటున్నారని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.

అదరాబాదరగా నోటీసులు..
అంతకు ముందు మహా పాదయాత్ర అనుమతులకు సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. పాదయాత్రకు సంబంధించి డీజీపీ తగిన ఉత్తర్వులు జారీచేస్తారని హోం శాఖ తరుపున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో వివరాలను నమోదుచేసుకున్న న్యాయమూర్తులు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని న్యాయమూర్తులు ఆదేశించారు. యాత్రకు అనుమతిస్తే మంచిదని.. లేకుంటే పోలీస్ శాఖ జారీచేసే ఉత్తర్వుల చట్టబద్ధత పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జరిగిన పరిణామాలు, పాదయాత్ర రూట్ మ్యాప్ లో ఆయా జిల్లాల ప్రజల భావోద్వేగాలు, శాంతిభద్రతలను ప్రస్తావిస్తూ అనుమతులు నిరాకరిస్తున్నట్టు డీజీపీ నోటీసుల్లో పేర్కొన్నారు.
నేడు విచారణ
ప్రధానంగా అమరావతి రైతులు అమరావతి టూ తిరుపతి పాదయాత్రలో జరిగిన ఘటనలను డీజీపీ ప్రస్తావించారు. నాడు చెలరేగిన హింసాత్మక ఘటనలను తెరపైకి తెచ్చారు. నాడు పోలీసులు, ఉద్యోగులపై జరిగిన దాడులు, ప్రతిఘటనను గుర్తుచేశారు. అప్పట్లో ఉద్దేశపూర్వకంగా దాడులు, అడ్డగింపులు చేశారు..71 క్రిమినల్ కేసులు నమోదుకావడాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు మహాపాదయాత్ర ప్రతిపాదిత రూట్ లో ప్రజలకు మూడు రాజధానులపై ఆకాంక్షాలున్నాయని పేర్కొన్నారు.

పైగా పాదయాత్రలో ఎంతమంది హాజరవుతారో నిర్వాహకులే చెప్పలేకపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. కోనసీమ జిల్లా పేరుమార్పు విషయంలో ఇటీవల చెలరేగిన విధ్వంసాలను గుర్తుచేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తూ ఓ మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని దహనం చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. యాత్ర ముగింపు జిల్లా అయిన శ్రీకాకుళంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవలను కూడా డీజీపీ ప్రస్తావిస్తూ అమరావతి జేఏసీ నాయకులకు నోటీసులందించారు. ఎట్టి పరిస్థితుల్లో మహా పాదయాత్రకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. అయితే దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. డీజీపీ ప్రతిపాదనలను కోర్టు ముందుకు రానున్నాయి. దీనికి కౌంటర్ ఇచ్చేలా అమరావతి రైతులు కూడా కీలకాంశాలను కోర్టు ముందు ఉంచనున్నారు. కోర్టు ఆదేశాలపైనే మహా పాదయాత్ర నిర్వహణ ఆధారపడి ఉంటుంది.
Also Read:NBK 107 Pre Release Business: టైటిల్ కూడా ఖారారు కాకముందే 80 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య బాబు