YCP- Mudragada Padmanabham: వచ్చే ఎన్నికల్లో కాపుల ఆగ్రహానికి గురికాక తప్పదని జగన్ భావిస్తున్నారా? వారంతా జనసేన వైపు టర్న్ అయ్యారని దాదాపు ఫిక్స్ అయ్యారా? ఉన్న నాయకులను, కొద్దిపాటి శ్రేణులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందుకు ముద్రగడ పద్మనాభం ఆశాదీపంగా కనిపిస్తున్నారా? ఆయన్ను పార్టీలోకి రప్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారా? ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్పించి ఆయనకు నచ్చిన పదవి కోరుకోవాలని ఆఫరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ముద్రగడ చుట్టూ తిరుగుతుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ఇటీవల వైసీపీ, జనసేన మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరింది. ఇది కాస్తా కాపులతోనే జగన్ ఫైట్ చేస్తున్నారనే స్థాయికి చేరింది. కాపు సామాజికవర్గాన్ని నిర్వీర్యం చేయడాని అదే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ ఆడుకుంటున్నారన్న అనుమానం పెరిగింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కాపు రిజర్వేషన్ అనేది తన పరిధిలో లేదని తేల్చడం ద్వారా జగన్ కాపులను దూరం చేసుకున్నారు. అటు తరువాత కాపు సంక్షేమ పథకాలను నిలిపివేసి మరికొందర్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు అదే పనిగా పవన్ ను తిట్టించడం ద్వారా దాదాపు అందర్నీ దూరం చేసుకునే స్థితికి చేరుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కాపులే గండికొడతారని జగన్ భయపడుతున్నారు.
తాజా పరిణామాలతో జగన్ చూపు ముద్రగడ వైపు పడింది. గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ చేసిన ఉద్యమం జగన్ అధికారంలోకి రావడానికి ఎంతగానో ఉపయోగపడింది. అయితే జగన్ మాత్రం ఉద్యమ ఫలాలను ఆదిలోనే తుంచేశారు. అటు తన ఉద్యమాన్ని సొంత వర్గీయులే అనుమానపు చూపులు చూశారని ముద్రగడ కూడా బంద్ చేశారు. సైలెంట్ అయిపోయారు. అడపాదడపా జగన్ కు, చంద్రబాబులకు లేఖలు రాస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన రూపంలో ఎదురవుతున్నపరిణామాలు, చంద్రబాబుతో పవన్ కలయిక తదితర పరిణామాలు జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అర్జెంటుగా ముద్రగడను వైసీపీలో చేరిస్తే తప్ప ఉపశమనం దొరకదన్న రేంజ్ లో జగన్ ఆలోచన చేస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీకి చెందిన కాపు సామాజికవర్గం మంత్రులు ముద్రగడను కలిశారు. జగన్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఒక్క సీఎం పదవి తప్పిస్తే ఏదైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. ముందుగా రాజ్యసభ ఆఫర్ ఇచ్చారు. మొన్నటికి మొన్న బీసీ సంఘం నేత కృష్ణయ్య ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. లేదు ఎమ్మెల్సీ కావాలంటే త్వరలో లోకేష్ పదవీకాలంతో అయ్యే స్తానాన్ని భర్తీ చేస్తామని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం వరకూ పదోన్నతి కల్పిస్తామని.. ఇది మా మాట కాదు జగన్ మాటగా చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే పవన్ ఎపిసోడ్ తో ముద్రగడకు భలే క్రేజ్ వచ్చిందన్న మాట.