Pawan Kalyan Yuvashakti- YCP: ఎన్నో రాజకీయ సంచలనాలకు యువశక్తి కార్యక్రమం వేదిక కానుంది. 100 మంది యువ ప్రతినిధులతో మాట్లాడించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ దగాకు గురైన యువతను ఒక వేదికపైకి తెచ్చి వారి మనోభావాలను తెలుసుకోవడంతో పాటు వాటిపై పవన్ ప్రసంగించనున్నారు. పరిష్కార మార్గం చూపించనున్నారు. వారి సమస్యలపై పోరాట పంథాను ప్రకటించనున్నారు. ప్రధానంగా యువతకు సంబంధించి రెండు తీర్మానాలు చేయనున్నట్టు తెలుస్తోంది. పవన్ తన ప్రసంగంలో అధికార పక్షంతో పాటు కొన్ని రాజకీయ కుటుంబాలపై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశముంది. దశాబ్దాలుగా యువతను రాజకీయంగా అణచివేస్తున్న కొన్ని కుటుంబాల మీద, రాజకీయ అంశాలపైనా, పార్టీ భవితవ్యం కోసం తీసుకోబోయే నిర్ణయాలపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. అయితే ఇప్పటికే యువశక్తి సెగ అధికార పార్టీకి తగిలింది. మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మాటల దాడులు ప్రారంభించారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కార్యక్రమం కొనసాగనుంది. తొలుత జనసేన తరుపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేవారి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఒంటరి పోరుతో చాలామంది స్థానిక సంస్థల్లో పోటీచేసి గెలుపొందారు. ఇటీవల చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులు జనసేనలో చేరారు. వీరిని సాదరంగా ఆహ్వానించనున్నారు. ఆత్మీయంగా సత్కరించనున్నారు. అనంతరం ఉత్తరాంధ్రకు సంబంధించి జానపద, సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. అనంతరం ఎంపిక చేసిన 100 మంది యువత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించనున్నారు. అనంతరం రాష్ట్ర యువత కోసం రెండు తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ఆమోదముద్ర వేయనున్నారు.
యువశక్తి సభకు ఉత్తరాంధ్ర ఫ్లేవర్ వచ్చేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివివేకానందుడి జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో వేదిక ప్రాంగణాన్ని వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు.35 ఎకరాలున్న ప్రంగణానికి నాలుగు మార్గాలను ఏర్పాటుచేశారు. వాటికి ఉత్తరాంధ్ర మహనీయులు అల్లూరి సీతారామరాజు, కోడి రామ్మూర్తి, వీరగున్నమ్మ, గిడుగు రామ్మూర్తిల పేర్లను పెట్టారు.

తొలుత యువశక్తిని అధికార పార్టీ లైట్ తీసుకుంది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో వైసీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. అందుకే తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో ఎదురుదాడి ప్రారంభించారు. రెండు రోజులు ముందు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి విడదల రజనీ యువశక్తిపై కామెంట్స్ చేశారు. అది యువశక్తి కాదు.. నారా శక్తి అని పెట్టుకోవాలని సూచించారు. అటు జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సైతం విమర్శనాస్త్రాలు సంధించారు. అటు మత్స్యకార గ్రామాల్లో వరుస పర్యటనలు చేసి .. యువశక్తి కార్యక్రమానికి మత్స్యకారులు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. ఈ విషయాలన్ని జనసేన హైకమాండ్ కు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువశక్తి వేదికపై పవన్ ప్రసంగం వాడీవేడిగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ప్రసంగం తరువాత అధికార పార్టీ నుంచి ఎదురుదాడికి కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.