అందరూ నవమాసాలు మోసిన అమ్మ గురించే మాట్లాడుతారు.. కానీ, పుట్టిన దగ్గర్నుంచి గుండెల మీద ఎత్తుకొని పెంచుతూ.. జీవితాంతం కళ్లలో పెట్టుకునే తండ్రి గురించి మాత్రం పెద్దగా మాట్లాడరు. ఈ విషయంలో ఖచ్చితంగా నాన్న వెనుకబడిపోయాడు. ఎంత చేసినా.. తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి దక్కలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో తండ్రిని గుర్తు చేసుకునేందుకు కూడా ఒక రోజును కేటాయించారు. జూన్ నెలలో వచ్చే మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకుంటారు.
ప్రతీ కుటుంబంలో తండ్రి పాత్ర ఏంటనేది అందరికీ తెలిసిందే. తన బతుకు తాను బతుకుతూనే అందరి బాధ్యతలను మోస్తాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, కుటుంబ పెద్దగా పురుషుడు నిర్వర్తించే పని ఎంతో గురుతరమైనది. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటోనే ఇవన్నీ సక్రమంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఒక విఫలమైన కుటుంబ పెద్దగా చూపించడానికి సమాజం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాంటి తండ్రి బాధ్యతను గుర్తించి, గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ఇందుకోసం ఒక రోజును కేటాయించడం అనేది అమెరికాలో మొదలైంది. 1910 నుంచి ఫాదర్స్‌డే నిర్వహిస్తున్నారు. తేదీలతో సంబంధం లేకుండా.. ప్రతీ జూన్ మూడవ ఆదివారాన్ని పాదర్స్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ రోజును మొదలు పెట్టింది ఓ మహిళ. ఆమె పేరు సోనోరా. ఈమె తండ్రి పేరు జాక్సన్ స్మార్ట్. ఆరుగురు పిల్లలకు తండ్రి అయిన జాక్సన్.. ఎంతో కష్టపడి వాళ్లను పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో కోల్పోయారు. ఇదంతా దగ్గర్నుంచి గమనించిన కూతురు సోనోరా.. తండ్రి సేవలను గుర్తు చేసుకునేందుకు ఖచ్చితంగా ఒక రోజు ఉండాలని కోరుకుంది.
ఈ విషయాన్ని అక్కడి చర్చ్ ఫాదర్స్ తో చర్చించి, తన తండ్రి పుట్టిన రోజైన జూన్ 5న నిర్వహించాలని అనుకున్నారు. కానీ.. చర్చి వేళలో కలిసి రాలేదు. దీంతో.. జూన్ మూడో వారానికి వాయిదా వేశారు. ఆ విధంగా అప్పటి నుంచి ప్రతి ఏటా మూడో ఆదివారం తండ్రుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదట అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ ఉత్సవం.. క్రమంగా ప్రపంచం మొత్తం విస్తరించింది.
పిల్లలకు జన్మనిచ్చి, వారి కోసం జీవితాన్నే త్యాగం చేసే.. తండ్రుల సేవలను గుర్తు చేసుకోవడం అనేది చిన్న కృతజ్ఞత మాత్రమే. అది పిల్లల కనీస బాధ్యత. కాబట్టి.. ఈ ఆదివారం తప్పకుండా మీ నాన్నతో గడపండి. ఆయన మీకోసం వెచ్చించిన కాలాన్ని, మీపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ.. అందులోంచి కొంచెమైనా తిరిగి ఇవ్వండి. హ్యాపీ ఫాదర్స్ డే.. ఇన్ అడ్వాన్స్.