ఈరోజు ఉదయం జగన్ ప్రధానమంత్రి మోడీని కలవబోతున్నాడు. రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. జగన్ ఇటీవల డిల్లీ పర్యటనప్పుడే దీనిపై మా విశ్లేషణను ఇచ్చాము. బిజెపి శివ సేన, అకాలీదళ్ ని పోగొట్టుక్కున్న నేపధ్యంలో వైఎస్ఆర్ సిపిని చేర్చుకోవటానికి ప్రయత్నం చేయొచ్చని చెప్పాము. వాస్తవానికి లోక్ సభ డిప్యూటి స్పీకర్ పదవి సంవత్సరం నుంచి ఖాళీగా వుంది. అంతకుముందు ఒకసారి వైఎస్ఆర్ సిపికి ఆఫర్ చేస్తే తీసుకోలేదు. అప్పటినుంచి అది అలానే వుంది, తిరిగి దానిని తీసుకోమని ఇంకోసారి మోడీ ప్రభుత్వం అడిగే అవకాశం వుందని కూడా చెప్పాము. వైఎస్ఆర్ సిపి డైలమా ని అర్ధంచేసుకోవచ్చు. ముస్లింలు, దళితులు పూర్తిగా వైఎస్ఆర్ సిపిని సమర్దిస్తున్నప్పుడు బిజెపి తో జత కడితే మొదటికే మోసమొస్తుందని జగన్ భావిస్తుండబట్టే ఆ ఆఫర్ ని తిరస్కరించాడు. ఇప్పుడుకూడా ఆ పరిస్థితుల్లో మార్పులేమీ లేవు.
ఆంద్ర రాజకీయాల్లో గందరగోళం
జగన్ సమస్య ఏమిటంటే మోడీ ఆఫర్ ని పూర్తిగా తిరస్కరించనూలేడు. దానికి పలు కారణాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు పై ప్రతీకారం తీర్చుకోవాలంటే కేంద్రం సహకారం అవసరం. రెండు, రాష్ట్రానికి నిధులు రావాలంటే కేంద్రం సహకారం అవసరం. మూడు, తనమీద వున్నసిబీఐ కేసుల నుంచి బయటపడాలన్నా కేంద్రం సహకారం అవసరం. ఇన్ని అవసరాలు పెట్టుకొని నిర్మొహమాటంగా మోడీకి నో చెప్పలేడు. అదేసమయం లో ఒప్పుకోనూ లేడు. ఒప్పుకుంటే తన కోర్ బేస్ దూరం అయ్యే అవకాశం వుంది. మోడీ తనని ఇంతగా పిలిచి మాట్లాడుతున్నాడంటే తనకు బలముండబట్టే కదా. అటువంటిది ఆ బలాన్ని వదులుకుంటే తన రాజకీయ ఉనికే దెబ్బతింటుంది. అందుకే తిరస్కరించటానికే మొగ్గు చూపుతాడు. కాకపోతే అది మోడీ మనసు నొప్పించకుండా చెప్పాల్సివుంది. అదేమిటో త్వరలో తెలుస్తుంది.
ఇక బిజెపి పరిస్థితి కూడా రాష్ట్రంలో దెబ్బతింటుంది. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత బిజెపి రాష్ట్రంలో పుంజుకుంటున్న అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ సిపి, తెలుగుదేశం పై దూకుడుగా ముందుకెల్తున్నాడు. ఆ వ్యూహం ఇప్పుడిప్పుడే ఫలితం ఇస్తున్నట్లు కనబడుతుంది. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం జగన్ పార్టీ ని కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే రాష్ట్ర బిజెపి ఇబ్బందుల్లో పడటం ఖాయం. తిరిగి తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా తిష్టవేయటం ఖాయం. అందుకనే ఇది అటు వైఎస్ఆర్ సిపి కి, ఇటు బిజెపికి ఆత్మహత్యా సదృశకం. బిజెపి ఎన్డిఏ ని బతికించటం కోసం రాష్ట్ర పార్టీని దెబ్బ తీసినట్లే అవుతుంది.
మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి?
అదే జరిగితే బిజెపి-పవన్ కళ్యాణ్ మైత్రి పరిస్థితి ఏమిటి అనేది అందరి మదిలో నలుగుతున్న సమస్య. నిజంగానే పవన్ కళ్యాణ్ ని విశ్వాసం లోకి తీసుకోకుండా తెరచాటు మంతనాలు జరుగుతున్నాయా? ఒకవైపు జాతీయ స్థాయిలో పరువు నిలుపుకోవటం కోసం వైఎస్ఆర్ సిపి తో సంధి కుదుర్చుకుంటే రెండోవైపు రాష్ట్రంలో వున్న మైత్రి ని వదులుకోవలసి వస్తుంది. ఆంధ్రలో బిజెపి-జనసేన మూడో కూటమిగా ఎదిగే అవకాశాన్ని పోగొట్టుకోవటమే కాకుండా, బిజెపి క్రెడిబిలిటీ కి కూడా దెబ్బతగులుతుంది. వున్న మిత్రుడ్ని పోగొట్టుకొని కొత్త మిత్రున్ని తెచ్చుకోవటం ఏ మాత్రం బిజెపి కి లాభంకాదు. బిజెపి విశ్వసనీయత కు పెద్ద మచ్చ గా మిగులుతుంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ కి పెద్ద దెబ్బనే. ఇప్పటికే ఒకసారి కమ్యూనిస్టులతో పెట్టుకొని బయటకొచ్చి బిజెపి తో కలవటంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ పొత్తు చెడిందంటే పవన్ కళ్యాణ్ కి నైతికంగా దెబ్బ తగులుతుంది. అప్పుడు స్వతంత్రంగా పోటీ చేయాల్సి వస్తుంది. ప్రజల్లో ఇన్నిసార్లు అటూ ఇటూ మారటం ఇమేజ్ కి దెబ్బ తగిలే అవకాశం వుంది. కాబట్టి ఈ వార్తలు నిజమయితే అటు వైఎస్ఆర్ సిపికి, బిజెపికి, జనసేనకు ఎవ్వరికీ ప్రయోజనం కలగదు. ఏదైనా ప్రయోజనం వుంటే తెలుగుదేశంకే వుండే అవకాశం వుంది. ఇదంతా లోతుగా ఆలోచించుకోకుండా మోడీ, అమిత్ షా లు జగన్ తో పొత్తు కుదుర్చుకుంటే జరగబోయే పరిణామాలకు కూడా వల్లే బాధ్యత వహించాల్సి వుంది. ఇవన్నీ ఊహాగానాలే అయితే ఈ గందరగోళ రాజకీయాలకు తెరపడుతుంది. లేకపోతే ఆంధ్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం వుంది.