Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ప్రయాణించడం సాధ్యమేనా? గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండడం వీలవుతుందా? అంటే దీనికి ఔను…సాధ్యం అవుతుంది అని చెబుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు.
ఏ ముహూర్తాన కూలి కుతుబ్ షా “నా ఈ నగరాన్ని నిండా జనంతో నింపు” అన్నాడో… నిజంగానే ఇప్పుడు జనంతో నిండా హైదరాబాద్ అలరారుతోంది. ఓ మినీ ఇండియా గా వినతి కెక్కుతున్నది. ప్రఖ్యాత సంస్థల తో అంతర్జాతీయ నగరంగా వెలుగొందుతోంది.. ఈ క్రమంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే వాటిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టింది.. ఈ పథకం మొదటి దశలో 8,092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, ఆర్ యూ బీ ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 3748.85 కోట్లతో 31 చోట్ల ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది.. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 17 ప్రాజెక్టులు పూర్తి చేసింది.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పు తీసుకునే అనుమతి ఇచ్చింది. బాండ్ల ద్వారా 1,000 కోట్లు, రూపీ టర్ములోన్ ద్వారా 2,500 కోట్లు సమీకరించుకోవాలని సూచించింది.

బాండ్ల రూపంలో నిధులు సమీకరించింది
ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల జారీ రూపంలో నిధులు సమీకరించే ప్రయత్నం చేయగా.. మూడు దఫాల్లో 495 కోట్లు సమకూరాయి. ఇలా సేకరిస్తున్న నిధులపై వడ్డీ భారంగా మారుతున్న తరుణంలో మిగిలిన 505 కోట్ల సమీకరణను దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం ఆపేశారు.. రూపీ టర్మ్ లోన్ రూపంలో పలు దఫాలుగా 2500 కోట్లను సమీకరించి ఎస్ఆర్డీపీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారు.. ఈ నిధులు ఏడాది కిందటనే అయిపోయాయి.. కొత్తగా అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. ఈ తరుణంలో 505 కోట్ల బాండ్ల జారీ రుణ పరిమితిని జిహెచ్ఎంసి ఆర్థిక విభాగం రూపీ టర్మ్ లోన్ గా మార్చుకున్నది. బ్యాంకు లోన్ కింద చివరి 505 కోట్లను సమీకరించింది.. ప్రాజెక్టు పూర్తి గానూ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బదలాయించి తొలి విడతను విజయవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్టు జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి.. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. హైదరాబాద్ పరిధిలోని అన్ని విభాగాల రహదారులు కలిసి 9,204 కిలోమీటర్లు ఉన్నాయి..
ట్రాఫిక్ రహిత నగరంగా మార్చేందుకు..
నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.. 400 సంవత్సరాల చారిత్రక పురాతన నగరమైన హైదరాబాద్లో రహదారులపై ఫ్లై ఓవర్లు, కారిడార్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టడం అత్యంత కఠినం అయినప్పటికీ.. ప్రభుత్వం పనులు పూర్తి చేస్తున్నది. ఇందులో భాగంగా 29,695.20 కోట్ల అంచనా వ్యయంతో నగరంలోని 54 జంక్షన్ లలో 111 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్లు/ స్కై వేలు/ అండర్ పాస్ లు నిర్మించనుంది. ఇందులో భాగంగా మొదటి రెండు దశల్లో 6,000 కోట్లతో నగరంలో వివిధ ప్రాంతాల్లో పనులు చేపట్టింది.. మొదటి దశలో దాదాపు 3 వేల కోట్లతో ఈస్ట్ జోన్ లోని ఎల్బీనగర్ కారిడార్, వెస్ట్ జోన్ లోని మైండ్ స్పేస్ కారిడార్ లోని నాలుగు అండర్ పాస్ లు, 16 ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పర్యావరణ అనుమతుల్లో జాప్యం వల్ల ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.. రెండో దశలో దాదాపు 3 వేల కోట్లతో ఏడు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

నేడు 17వ ప్రాజెక్టు ప్రారంభం
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి చేసిన 17వ ప్రాజెక్ట్ శుక్రవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది.. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మీదుగా ఓఆర్ఆర్ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ శుక్రవారం ప్రారంభమైంది.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐకియా మీదుగా ఈ కొత్త ఫ్లైఓవర్ ద్వారా నేరుగా ఓ ఆర్ ఆర్ కు.. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సులభంగా చేరుకోవచ్చు. దీని ద్వారా గచ్చిబౌలి జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి.. గచ్చిబౌలి జంక్షన్లో రద్దీ సమయంలో పదివేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.. హైదరాబాద్ నాలెడ్జి సెంటర్ పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఈ ఫ్లై ఓవర్ ద్వారా సదుపాయం కలుగుతుంది. హైటెక్ సిటీ, హెచ్ కే సీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ల మధ్య మంచి కనెక్టివిటీతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కు( పంజగుట్ట), ఔటర్ రింగ్ రోడ్డు(గచ్చి బౌలి)కు కూడా ఇది మంచి కనెక్టివిటీ. ఇక గడిచిన ఆరేళ్లలో జిహెచ్ఎంసి పూర్తి చేసిన 17వ ప్రాజెక్ట్ ఇది.. ఈ ప్రాజెక్టు వ్యయం, భూ సేకరణ, టీడీ ఆర్ లతో సహ 466 కోట్లు ఖర్చు అయింది. ఫ్లై ఓవర్ పొడవు 2810 మీటర్లు.. నాలుగు లైన్లు.. రెండు వైపులా కూడా ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు.