AP Govt- Debts: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఆర్థిక శాఖ అధికారులను వెంటబెట్టుకొని హస్తిన పయనమయ్యారు. డిసెంబరు నెల జీతాల కోసం అప్పులు తప్పవని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ను వేడుకోనున్నారు. ఇప్పటికిప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు ఇవ్వకుంటే జీతాలు, పెన్షన్లు ఇవ్వలేమిని మొర పెట్టుకోనున్నారు. మరో నాలుగురోజుల వ్యవధే ఉన్నందున పర్మిషన్ ఇస్తే.. మంగళవారం నాటికి బాండ్లు వేలం వేసి కాస్తా ఆలస్యంగానైనా జీతాలు ఇచ్చుకుంటామని విన్నవించనున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితిని ఏపీ ఏనాడో దాటిపోయింది. కానీ ప్రతీనెలా ఏపీ విన్నపాలకు కేంద్రం తలొగ్గుతోంది. ఈ నెల కూడా అదే సీన్ క్రియేట్ అయ్యే అవకాశముంది.

వాస్తవానికి ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి అప్పు రుణపరిమితి విషయంలో కేంద్రం వెసులబాటు కల్పించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఇప్పటివరకూ ఈ ఏడాదిలో తెలంగాణకు రూ.20 వేల కోట్లనే అప్పు పర్మిషన్ గా ఇచ్చారు. అదే ఏపీకి మాత్రం రూ.50 వేల కోట్లకుపైగా అనుమతిచ్చారు. ఇంకా ఆర్బీఐ నుంచి కూడా అప్పు తెచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయినా ఇంకా అప్పు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తునే ఉంది. ఇవ్వాలని కేంద్రం కాళ్లావేళ్లా పడుతోంది. అటు సెక్యూరిటీస్ వేలం వేసుకుంటామని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.
నెలకు సగటును రూ.2 వేల కోట్లు అప్పుచేస్తే కానీ గండం గడిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఆపై ఏదైనా సంక్షేమ పథకం మీట నొక్కాలంటే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనతో పాటు అధికారులు వారాలు తరబడి ఢిల్లీలో మకాం వేస్తున్నారు. అప్పులకు ఎన్ని మార్గాలు ఉన్నాయో.. అన్నింటినీ అన్వేషిస్తున్నారు. బ్యాంకు లూప్ హోల్స్ తెలిసిన మాజీ అధికారులకు సలహాదారులుగా నియమించి మరీ అప్పుల కోసం రంధ్రాన్వేషణ చేస్తున్నారు. అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని మినహాయింపులకు ఏపీకి లభిస్తుండడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో జగన్ సర్కారు బీజేపీతో కానీ.. కేంద్రపెద్దలతో కానీ ఎప్పుడూ ఘర్షణ వాతావరణంలో వెళ్లలేదు. వీలైనంతవరకూ స్వామిభక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న విశాఖ టూర్ లో కూడా ప్రధాని మోదీని సార్ సార్ అంటూ జగన్ వినమ్రత ప్రదర్శించారు. అటు ప్రధాని పర్యటనను తన సొంత పార్టీ మాదిరిగా భావించి ఏర్పాట్లు చేశారు. అయితే ఏది ఎలా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగానే భావించాలి. అభివృద్ధి పనులకు ఇతోధికంగా నిధులు అందించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టారాజ్యంగా అప్పులకు అనుమతివ్వడం అంటే.. ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను అంధకారంలో నెట్టడమేనన్న విషయాన్ని గుర్తెరగాలి.