చరిత్రలో ఎన్నో ఉద్యమాలను చూశాం. వాటిని అణిచివేయడాన్ని కూడా చూశాం. కానీ.. రైతు ఉద్యమాన్ని ఎవరూ అణిచివేయలేరని మరోసారి ఢిల్లీ వేదికగా రైతులు నిరూపించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. రెండునెలలుగా దేశ రాజధాని నగరం వెలుపల వేర్వేరు చోట్ల సాగుతున్న రైతుల ఉద్యమాన్ని అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు శ్రుతిమించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా పలు అంచెల్లో బారికేడ్లు నిర్మించటం, రోడ్లపై మేకులు నాటడం, ముళ్లకంచెలు, కందకాలు ఏర్పాటు వంటివి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ అదుపు తప్పటం, కొందరు ఎర్రకోట ఆవరణలోకి చొరబడి అక్కడ రైతు జెండా, సిక్కు ఖల్సా జెండా ఎగరేయటం వంటి పరిణామాల అనంతరం దాన్ని అదుపు చేయటంలో విఫలమైన పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగాక ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది.
Also Read: మంత్రి పెద్దిరెడ్డితో నిమ్మగడ్డ వార్.. 30మంది అధికారులు బదిలీ..
ఉద్యమాలు కట్టుతప్పినప్పుడు, అవి హింసాత్మకంగా మారినప్పుడు అదుపు చేసేందుకు చాలా మార్గాలున్నాయి. ఢిల్లీ దిశగా వస్తున్న రైతుల్ని ఆపడానికి అనేకచోట్ల లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు, వాటర్ కేనన్ ప్రయోగాలు పూర్తయ్యాయి. అదృష్టవశాత్తు పరిస్థితి పోలీసుల కాల్పులవరకూ పోలేదు. అయితే.. ఇవన్నీ ఏదోమేరకు పనికొచ్చేవే తప్ప వాటివల్లే సర్వం సర్దుకుంటుందన్న అభిప్రాయానికి రావటం సరికాదు. ఇప్పుడు నిర్మిస్తున్న బారికేడ్లు, మేకులు నాటడం, ముళ్లకంచెలు, కంద కాలు… ఇంటర్నెట్ నిలిపేయటంవంటివి కూడా అంతే.
అయితే.. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింస, విధ్వంసం.. పోలీసులపై దాడుల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. దాన్నెవరూ తప్పుబట్టరు. రైతు సంఘాల నాయ కులే ఆ మాట చెబుతున్నారు. తాము నిర్దేశించిన సమయంకన్నా చాలాముందే కొన్నిచోట్ల రోడ్లపైకి రైతులు వచ్చేలా ప్రేరేపించిన వారెవరో ప్రభుత్వం తేల్చాలంటున్నారు. వారైతే దీప్‌సింగ్ సిద్ధూ పేరు చెబుతున్నారు. అతనితో ఉద్యమ సంస్థలకు సంబంధం లేదంటున్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరగటానికి, నేరం చేయదల్చుకున్నవాళ్లు జంకటానికి, నిరసనోద్యమాలు హద్దుమీరకుండా ఉండేందుకు విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థ ఉంటుంది. భారీ సంఖ్యలో పోలీసు బలగం, వారి చేతుల్లో లాఠీలు, ఆయుధాలు, పోలీసు వాహనాలు వగైరాలు ఇందుకు తోడ్పడతాయి.
ఈ ప్రాసెస్‌లో అన్నింటికన్నా ముఖ్యం నిఘా విభాగం. ఆ విభాగం నిరంతరాయంగా, చురుగ్గా పనిచేస్తుంటే ఎవరెవరి వ్యూహాలేమిటో, ఏం జరిగే అవకాశముందో ముందుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనడం పోలీసు శాఖకు సులభమవుతుంది. కానీ గణతంత్ర దినోత్సవం రోజు ఈ రెండు అంశాల్లోనూ ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న కొందరు ఎర్రకోటలోకి చొరబడుతున్నప్పుడు అక్కడ పటిష్టమైన భద్రత లేదు. ఆ లోపాలను సరిచేసుకుంటే మళ్లీ ఆనాటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశమే ఉండదు. నిరసన వేదికలను దిగ్బంధించటం వాటికి విరుగుడు కాదు. ఇవి ఢిల్లీకి కొత్తగా వచ్చే ఉద్యమకారుల్ని ఆపడానికి ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పొచ్చు. కానీ ఈ చర్యల వల్ల తమకు నీళ్లు, ఆహారం అందటం, కాలకృత్యాలు తీర్చుకోవటం పెను సమస్యగా మారిందని రైతులు చెబుతున్నారు. ఈ తీరు ప్రభుత్వంపై వారిలో వున్న అసంతృప్తి, అపనమ్మకం పెరగటానికి తప్ప మరెందుకూ తోడ్పడదు.
అంతిమంగా చర్చలే ఈ పరిస్థితులకు ఓ దారి చూపుతాయి. ఉద్యమాలను చల్లారుస్తాయి. అసలు చట్టాలను తీసుకురావటానికి ముందే రైతు పక్షాలను ఇన్‌వాల్వ్ చేసి చర్చించి ఉంటే బాగుండేది అనేది అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం ఆ మాదిరి చర్చించానని చెబుతోంది. కానీ అలా చర్చించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంఎస్‌పీని చట్టబద్ధం చేయటం మొదలుకొని, కార్పొరేట్ సంస్థల పెత్తనం వరకూ అనేకానేక అంశాలపై రైతుల మనోభావాలేమిటో ప్రభుత్వానికి తెలిసేది. ఆ సంశయాలను పోగొట్టేవిధంగా చట్టాలకు రూపకల్పన చేయటం సాధ్యమయ్యేది. కనీసం బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడైనా విపక్షాలు కోరినట్టు వాటిని సెలెక్ట్ కమిటీకి పంపితే ఇంత సమస్య తలెత్తేది కాదు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆరేళ్లలో వివిధ సమస్యలపై దేశంలో అక్కడక్కడ ఉద్యమాలు తలెత్తాయి. వాటన్నిటితో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమం సుదీర్ఘమైనది. పైగా రాజకీయంగా ఇది బీజేపీకి ఇబ్బంది కలిగించేది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గమైన జాట్‌లు చాన్నాళ్లుగా బీజేపీకి మద్దతుగా ఉన్నారు. అలాగే హరియాణాలో కూడా రైతుల మద్దతువల్లనే బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అలాంటివారికి సైతం ఈ చర్య ఆగ్రహం కలిగించిందంటే కారణమేమిటో ఆలోచించ వలసిన అవసరం ఉంటుంది. ఈ ఉద్యమంపై అంతర్జాతీయంగా పేరున్న పాప్ గాయని రిహానా, యువ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ తదితర ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రస్తావించటంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఈ ఉద్యమంపై పడింది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో ఈ ఉద్యమ ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి.
ఉభయ సభలూ వాయిదాలతో సాగుతున్నాయి. మొన్న యూపీలోని ముజఫర్‌నగర్‌లో గానీ, ఇప్పుడు హరియాణాలోని జింద్‌లో గానీ జరిగిన సభలకు వేల సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మహిళలు సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. రెండునెలలుగా వణికిస్తున్న చలిగాలులను కూడా తట్టుకుంటూ వృద్ధ రైతులు కూడా రోడ్లపైనే ఉన్నారు. మూడు సాగు చట్టాల రద్దు తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని రైతులు చెబుతున్నారన్నది వాస్తవమే. అయితే సమస్యను సాగదీయటం వల్లనే ఆ పరిస్థితి ఏర్పడింది. వెనువెంటనే చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని చెబితే ఇలా జరిగేదికాదు. కనుక అటు రాజకీ యంగా చూసినా, ఇటు శాంతిభద్రతల కోణంలో చూసినా రైతుల డిమాండ్లపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి ప్రయత్నించటం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
Also Read: విశేషాధికారాల నిమ్మగడ్డ.. ఏం చేయబోతున్నారు..?
కాగా.. భారీ భద్రతా వలయాన్ని ఢిల్లీ పోలీసులు సమర్థించుకున్నారు. ‘26వ తేదీన బారికేడ్లు ధ్వంసం చేసి, ట్రాక్టర్లను నడిపి, స్వైరవిహారం చేసి, పోలీసులపై దాడి చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ప్రశ్నిస్తున్నారా..? గణతంత్ర దిన ఘటనలాంటిది మళ్లీ జరిగితే ఎవరిది బాధ్యత?’ అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ ప్రశ్నించారు. దాడిలో గాయపడ్డ పోలీసుల సంఖ్య 510కి చేరిందని ఆయన చెప్పారు. పోలీసులు ఉక్కు రాడ్లతో లాఠీచార్జి చేస్తున్నారన్న ఆరోపణలను తిరస్కరించారు. కాగా, రిపబ్లిక్ దినోత్సవం నాటి హింసపై దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరుపుతుందని అక్కడి సీపీ అంటున్నారు.
ఈ పోరాటం దీర్ఘకాలం సాగుతుందని, దానికి సిద్ధంగా ఉండాలని రైతులకు బీకేయూ నేత రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. ‘ఈ ఏడాది అక్టోబరు-నవంబరు దాకా ఇది సాగవచ్చు. చేసిన చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఇళ్లకు వెళ్లేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. పంజాబీ రైతులపై బురద జల్లేందుకే ఎర్రకోట వద్ద ఖల్సా జెండా ఎగరేసిన వ్యక్తిని పోలీసు లు వదిలేశారన్నారు. రైతుల రాకపోకలను ఆపేయ డంపై నలువైపుల నుంచీ దాడి సాగుతుండడంతో కేంద్ర హోంశాఖ నెపం రాష్ట్రాల మీదకు తోసేసింది. ‘‘రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీ్‌స-శాంతి భద్రతలు రాష్ట్రాల జాబితా కిందకు వస్తాయి. దర్యాప్తులు, నేరాల ప్రాసిక్యూషన్, ప్రజల భద్రతకు హామీ, శాంతిభద్రతల పరిరక్షణ.. వీటన్నింటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
‘‘ఇదే మోదీ పాలనా శైలి. గొంతు నొక్కేయడం, నిర్బంధించి, ఎవరితో సంబంధం లేకుండా చేయడం, అణచేయడం..’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. ‘‘మూడంచెల సిమెంటు దిమ్మలతో గోడ లు కట్డడం కాదు. వారధులు నిర్మించండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. రైతులతో యుద్ధం చేస్తున్నారా? అని ప్రియాంక వాద్రా ప్రశ్నించారు.
మరోవైపు.. రైతులు చేస్తున్న ఆందోళనకు రాజకీయపక్షాల మద్దతు పెరుగుతోంది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్.. రాకేశ్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే అకాలీదళ్, ఆప్, కాంగ్రెస్, లెఫ్ట్, ఆర్జేడీ, ఎస్పీ, ఆర్‌ఎల్డీలకు చెందిన నేతలు రైతు నేతలను కలిసి మద్దతు తెలిపారు. అయితే రైతులపై దాడి చేసి, రాళ్లు రువ్వి, టెంట్లు పీకేసిన వ్యక్తులు స్థానికులు కాదని తాజాగా వెల్లడైంది. సింఘూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు మంగళవారం నీళ్లు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు సాయపడ్డారు. రైతులను తమ ఇళ్లకు తీసుకెళ్లి తమ టాయిలెట్లు, బాత్రూంలను వాడుకోమన్నారు. రైతుల టెంట్లకు విద్యుత్తు సరఫరాను ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనకు అంతర్జాతీయ పాప్ స్టార్ రిహానా మద్దతు ప్రకటించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Farmers protest delhi live updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com