కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం మొదలు పెట్టి నెలలు గడిచాయి. అయినప్పటికీ ఢిల్లీలో శాంతియుతంగానే నిరసన కొనసాగిస్తున్నారు రైతులు. అయితే.. వారి ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం దిగిరాలేదు. దీంతో రైతులు సహనంతోనే నిరసన తెలుపుతున్నారు. అయితే.. రైతు చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్న కొందరు బీజేపీ నేతలు రైతులను చులకనగా మాట్లాడుతున్నారు.
దేశంలోని పలుచోట్ల బీజేపీ నేతలు విధమైన మాటలు మాట్లాడుతున్నారు. పంజాబ్ లోని బీజేపీ ఎమ్మెల్యే అరున్ నారంగ్ కూడా కొన్ని రోజులుగా ఇదేతరహాలో రైతులపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మరో ప్రెస్ మీట్లో రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఒంటిమీదున్న బట్టలన్నీ చింపేశారు.
దేశంలో రైతు చట్టాలపై అత్యంత వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఉంది. అలాంటి చోట కూడా ఎమ్మెల్యే అరుణ్ నారంగ్.. రైతు ఉద్యమాన్ని తూలనాడుతూ మాట్లాడుతున్నారని సమాచారం. దీంతో రైతులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా.. రైతు చట్టాలకు మద్దతుగా మీడియా సమావేశం పెట్టబోతున్నారని తెలియడంతో అక్కడికి చేరుకున్న రైతులు..ఆయనను కొట్టారు. బీజేపీ కార్యాలయంపై దాడికి దిగి నిప్పంటించారు. రైతులు భారీ స్థాయిలో చుట్టుముట్టడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.
రైతుల్లో ఓపిక నశిస్తోందనడానికి ఇదే నిదర్శనం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. పైపెచ్చు బీజేపీ నేతలు రైతు చట్టాలకు మద్దతుగా మాట్లాడుతుండడం.. రైతు ఉద్యమాన్ని అవమానిస్తూ మాట్లాడుతుండడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, దాని ఫలితమే ఎమ్మెల్యేపై దాడి అని అంటున్నారు. మరి, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటోందోనని అంటున్నారు.