Falling TRS Graph: తెలంగాణలో అధికార గులాబీ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల్లో ఏపీ కన్నా.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా సీఓటర్ సంస్థ యాంగర్ ఇండెక్స్ పేరుతో చేసిన ఓ సర్వేలో ఇదే నిర్ధారణ అయింది. తెలుగు రాష్ట్రాలకు సంబధించి భిన్నమైన ఫలితాలొచ్చాయి.

ప్రభుత్వాల పనితీరుపై..
ఈ సర్వే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారన్న అంశంపై కాకుండాం సిట్టింగ్ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల పనితీరు, ఎంతమంది పాలకులను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాగ్రహం ఎలా ఉంది అని తెలుసుకోవడానికే ఈ యాంగర్ ఇండెక్స్ పేరుతో దేశవ్యాప్త సర్వే నిర్వహించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భిన్నమైన ఫలితాలొచ్చాయి.
అసంతృప్తిలో రెండు రాష్ట్రాలు టాప్ 5లో..
ప్రజల అసంతృప్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో టాప్ 5లో ఉన్నాయి. ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి 50 శాతం దాటిందంటే డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ దేశంలోనే రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలో ప్రజావ్యతిరేకతలో టీఆర్‌ఎస్ సర్కార్ ఒకటో స్థానంలో ఉంది. 66 శాతానికి మందికిపైగా తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక, జగన్ సర్కారుపై ఏపీలో 56.9 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రజావ్యతిరేకత ఉన్న ప్రభుత్వాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. ప్రజాగ్రహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రభుత్వాల జాబితాలో తెలంగాణ ఒకటో స్థానంలో ఉండగా.. ఏపీ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.
కేసీఆర్, జగన్‌పై సానుకూలత..
ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వాల జాబితాలలో తెలుగు రాష్ట్రాలు టాప్5లో ఉన్నప్పటికీ కేసీఆర్, జగన్‌పై మాత్రం ఆస్థాయిలో అసంతృప్తి లేదని సర్వేలో తేలింది. ప్రజల నుంచి అతి ఎక్కువ కోపాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల జాబితా టాప్‌లో వీరి పేర్లు లేవు. మొదటి స్థానంలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (35.4% వ్యతిరేకత) ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా బస్వరాజ్ బొమ్మై(కర్ణాటక, 33.1 శాతం), నీతీశ్‌కుమార్ (బిహార్, 32 శాతం వ్యతిరేకత) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ అతి తక్కువ ప్రజావ్యతిరేకత ఉన్న సీఎంగా నిలిచారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాస్త తక్కువే!
ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త అసంతృప్తి తక్కువగానే నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో 28.5% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో 23.5% మాత్రమే వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యేల వల్లే పార్టీకి గడ్డు పరిస్థితులు వస్తున్నాయని.. ఆయా పార్టీల అధినేతలు ఎమ్మెల్యేల్ని మందలిస్తున్నారు. కానీ విచిత్రంగా ప్రభుత్వంపైనే ఎక్కువ అసంతృప్తి ఉన్నట్లుగా తెలుతోంది.

పరిమితమైన శాంపిల్స్..
ఈ సర్వేలో సీ ఓటర్ సంస్థ యాంగర్ ఇండెక్స్ కోసం దేశవ్యాప్తంగా కేవలం పాతిక వేల మంది అభిప్రాయాలను మాత్రమే తీసుకుంది. వారినే రాష్ట్రాల వారీగా విభజించి.. ఫలితాలను ప్రకటించింది. దీంతో ఈ సర్వే ఫలితాల క్రెడిబులిటీపై విశ్వాసం తక్కేవే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోట్లాది మంది ఓటర్లు ఉన్న దేశంలో 25 వేల మంది అభిప్రాయాల ఆధారంగా వేసిన అంచనా వాస్తవికతకు అద్దం పట్టదన్న కొంతమంది పేర్కొంటున్నారు. లక్షల శాంపిల్స్ తీసుకుంటేనే ఫలితాలు తారుమారు అవుతున్న నేటి రోజుల్లో కేవలంం 25 వేల మంది అభిప్రాయం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకతను అంచనా వేయడం సరికాదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలడం విపక్షాలకు ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీఎంలపై అసంతృప్తి లేకపోవడం పాలక పార్టీలకు సంతృప్తిని ఇచ్చే విషయం.